తెలంగాణ ప్రభుత్వం నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో అర్థరాత్రి భారీ పేలుళ్లు సంభవించాయి. నాలుగో యూనిట్లో ప్రమాదం జరిగింది. ఆరు యూనిట్లలోనే దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. లోపల ఎంత మంది ఉన్నారో అర్థం కాని పరిస్థితి. ఇప్పటికైతే తొమ్మిది మంది చిక్కుకుపోయారని.. వారిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన తరవాత ప్లాంట్ ఆపరేషన్‌ను ఆపేయడానికి ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రం భూగర్భంలో ఉంటుంది. అందుకే ప్రమాదం జరిగిన వెంటనే… హుటాహుటిన అందరూ బయటకు రాలేకపోయారు. కొంత మంది బయటకు వచ్చారు. వారిని ఆస్పత్రులకు తరలించారు.
శ్రీశైలంకు వరద వచ్చినప్పుడు మాత్రమే.. విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. ఈ కారణంగా.. ఏడాదిలో ఎనిమిది, తొమ్మిది నెలల పాటు విద్యుత్ కేంద్రం ఉపయోగించరు. అయితే.. ఈ ఏడాది త్వరగా శ్రీశైలంకు నీరు రావడంతో… వచ్చినప్పటి నుండి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. నిరంతరాయంగా ఆ ఉత్పత్తి జరుగుతోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా.. జెన్కో అధికారుల్ని ఈ విషయంపై అభినందించారు. అయితే.. నిరంతరాయ ఉత్పత్తి చేస్తూ… కీలకమైన అంశాల్ని విస్మరించడం వల్ల ప్రమాదం జరిగిందన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
భారీ పేలుళ్లు జరగడం… భూగర్భంలో ఉండటంతో.. డ్యామ్‌కు ఏమైనా ఇబ్బందులు వస్తాయా.. అన్న ఆందోళన సాధారణ జనంలో వినిపిస్తోంది. అయితే అలాంటి అవకాశం లేదని.. విద్యుత్ కేంద్రంలో జరిగినదానికి డ్యామ్ భద్రతకు సంబంధం లేదని అంటున్నారు. ప్రస్తుతానికి ఎంత డ్యామేజ్ జరిగింది.. ఎంత ప్రాణ నష్టం జరిగిందనేది.. పూర్తిగా మంటలు అదుపులోకి.. పొగ మొత్తం క్లియర్ అయిన తర్వాత అంచనా వేయాల్సి ఉంది. మంత్రి జగదీష్ రెడ్డితో పాటు ఉన్నతాధికారులంతా… శ్రీశైలం ప్రాజెక్ట్ వద్దకు చేరుకుని .. సమీక్షిస్తున్నారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నేడు శ్రీశైలం ప్రాజెక్టును పరిశీలించాల్సి ఉంది.