ఆంధ్రప్రదేశ్ స్వచ్చతలో మెరుగవుతోంది. విజయవాడ దేశంలోనే అత్యంత శుభ్రత ఉన్న నగరాల్లో నాలుగో స్థానం సాధించింది. పది లక్షలకుపైగా జనాభా ఉన్న విజయవాడలో పరిశుభ్రతను పక్కాగా నిర్వహిస్తూ.. ఎంతోమంది సిబ్బంది, అధికారుల శ్రమ ఫలితంగా దేశంలోని పరిశుభ్రమైన పెద్ద నగరాల్లో బెజవాడకు 4వ స్థానం దక్కింది. దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో పరిశుభ్రత, పౌరసేవలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని కేంద్ర పట్టణ, గృహనిర్మాణ శాఖ ప్రతియేటా స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను ప్రకటిస్తుంది. అందులో భాగంగా గురువారం స్వచ్ఛ సర్వేక్షణ్-2020 అవార్డులను ప్రకటించింది.
గత ఏడాది స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకులో 12వ స్థానంలో ఉన్న విజయవాడ ఈసారి ఏకంగా 4వ స్థానానికి ఎగబాకింది. స్వచ్ఛ సర్వేక్షణ్ ర్యాంకింగ్స్ కోసం దేశవ్యాప్తంగా 4400 నగరాలు పోటీపడ్డాయి. 10 నుంచి 40 లక్షల జనాభా కలిగిన నగరాల విభాగంలో విజయవాడ నగరం 4వ స్థానాన్ని కైవశం చేసుకుంది. 2019 స్వచ్ఛ సర్వేక్షణలో నగరం 12వ ర్యాంకు సాధించింది. అంతకు ముందు ఏడాది అంటే 2018లో 5 ర్యాంకు సాధించడంతో 2019లో మొదటి మూడు స్థానాల్లో నగరం నిలుస్తుందని అంతా భావించారు. కానీ దిగజారింది.ఇప్పుడు మళ్లీ మెరుగుపడింది. విశాఖ తొమ్మిదో స్థానం దక్కించుకుంది.
ఇక పది లక్షల లోపు జనాభా కలిగిన నగరాలలో తిరుపతి ఆరో ర్యాంకులో నిలిచింది. రాజమండ్రి 51వ ర్యాంకులో నిలవగా.. ఒంగోలు 57, కాకినాడ 58వ స్థానాల్లో నిలిచాయి. తెనాలి 75, కడప 76, చిత్తూరు 81, తాడిపత్రి 99వ స్థానాలు దక్కించుకున్నాయి. మూడు లక్షల లోపు జనాభా కలిగిన మున్సిపల్ కార్పొరేషన్లలో తిరుపతి మున్సిపల్ కార్పరేషన్కు అగ్రస్థానంలో చోటు దక్కింది. ఇక సౌత్జోన్కు సంబంధించి 2 క్యాటగిరీల్లోని తొలి 100 ర్యాంకుల్లో ఏపీ పట్టణాలు ఏకంగా 72 సొంతం చేసుకున్నాయి. కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ 2016 నుంచి వార్షిక సర్వేలు నిర్వహిస్తూ అవార్డులు ప్రకటిస్తోంది. 4237 నగరాలు, పట్టణాల మధ్య జరిగిన పోటీలో ఈ ఏడాది ఏపీ ర్యాంకుల పంట పండించింది.
ఏపీ స్వచ్ఛతలో మెరుగవడంపై… ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సంతోషం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వాన్ని అందిస్తూ.. ప్రకటన విడుదల చేశారు.