అపెక్స్ కౌన్సిల్ భేటీ మరోసారి వాయిదా పడింది. కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కు కరోనా సోకడంతో ఆయన ఆస్పత్రిలో చేరారు. దీంతో.. ఇరవై ఐదో తేదీన నిర్వహించాల్సిన సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లుగా ప్రభుత్వాలకు సమాచారం పంపారు. నిజానికి ఈ సమావేశం ఐదో తేదీన జరగాల్సి ఉంది. అప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీని వాయిదా వేయాలని కోరారు. దాంతో అప్పుడు సమావేశం జరగలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ సమావేశం నిర్వహించి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పంచాయతీ తీర్చాలనుకున్న కేంద్రానికి మరో సారి కరోనా రూపంలో అడ్డంకి ఎదురయింది.
సాధారణంగా అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కోరిక మేరకు ఏర్పాటు చేస్తారు. విజ్ఞప్తులు లేకుండానే నిర్వహిస్తున్న అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని కేంద్రం ఏర్పాట ుచేసింది. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు పదే పదే ఫిర్యాదు చేసుకుంటూండటమే దీనికి కారణం. ముఖ్యంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో ముందుకెళ్లవద్దని చెబుతున్నప్పటికీ.. ఏపీ సర్కార్ పట్టించుకోవడం లేదు. టెండర్లను సైతం ఖరారు చేసింది. ఆదేశాలు కూడా పట్టించుకోకపోతూండటంతో కేంద్రం సీరియస్‌గా ఉంది.
రాజకీయం కోసమే.. నదీజలాల విషయంలో తెలుగు రాష్ట్రాలు, వివాదాలను శాశ్వతంగా పరిష్కరించుకునేందుకు ముందుకు రావడం లేదంటూ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ అసంతృప్తిగా ఉంది. నీటి కేటాయింపులు స్పష్టంగా ఉన్నప్పటికీ బోర్డు పరిధిని అంగీకరించకపోవడం, ఆదేశాలను గౌరవించకపోవడం వలనే తెలుగు రాష్ట్రాల మధ్య విభేధాలు తలెత్తుతున్నాయని కేంద్రం భావిస్తోంది. వీరి పంచాయతీని తెగ్గొట్టే ప్రయత్నానికి మాత్రం అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఇప్పుడు… ఏపీ సర్కార్.. ఎత్తిపోతల పనుల్ని ప్రారంభింపచేస్తే వివాదం మరింత ముదిరే అవకాశం ఉంది.