స్వదేశీ ఉత్పత్తులే ప్రజలంతా వాడాలని, పండుగ సమయంలో కొనే ప్రతి వస్తువుని అది ఎక్కడ తయారైందో చూసి మరి కొనాలని, ప్రజలంతా ఇలా స్వదేశి వస్తువులే కొనడం ద్వారా మన ఉత్పత్తులకు డిమాండ్ పెరిగి మన ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుందని పవన్కళ్యాణ్ పిలుపునిచ్చారు. వివరాల్లోకి వెళితే..
కరోనా, ప్రపంచం మొత్తాన్ని అతలాకుతలం చేసింది. అయితే ఆర్థిక వ్యవస్థ పై దీని ప్రభావం ఎలా ఉంటుంది అన్నది సమీప భవిష్యత్తులోనే తెలుస్తుంది. ఇప్పటికే చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఆర్థిక వ్యవస్థకు ప్రమాదం పొంచి ఉందని చైనా ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రజలందరూ మితంగా తినాలని అలా చేయడం ద్వారా ఆహార సంక్షోభాన్ని ఎదుర్కోవచ్చు అని ఆయన వింతైన పిలుపు కూడా ఇచ్చారు. అయితే చైనా మాత్రమే కాకుండా మిగతా దేశాలకు కూడా ఇదే తరహా ఆహార మరియు ఆర్థిక సంక్షోభం పొంచి ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఎటువంటి సంక్షోభాన్ని అయినా ఎదుర్కోవడానికి భారత్ సన్నద్ధంగా ఉందని ప్రభుత్వాలు చెప్పినప్పటికీ నిజంగా సంక్షోభం ఎదురైతే ప్రభుత్వాలు చేయగలిగిన పాత్ర పరిమితంగానే ఉంటుంది. అయితే స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా కొంతమేరకు డొమెస్టిక్ డిమాండ్ పెంచడానికి వీలవుతుందని, ఆర్థిక సంక్షోభాన్ని నిలువరించడానికి ఇదొక్కటే మార్గం కాకపోయినప్పటికీ, దేశీయంగా డిమాండ్ మరియు ప్రొడక్షన్ సమపాళ్ళలో ఉన్నట్లయితే సంక్షోభాన్ని కొంతవరకు నివారించవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
వినాయక చవితి నుండి ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ను సంయుక్తంగా ముందుకు తీసుకెళ్లనున్న @BJP4Andhra – @JanaSenaParty
#AatmaNirbharBharat pic.twitter.com/CYbgF1GTLL
— JanaSena Party (@JanaSenaParty) August 20, 2020
ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలని ప్రజలకు పిలుపు ఇవ్వడం తో పాటు, వినాయక చవితి నుండి ప్రజలలో దీని పట్ల అవగాహన కల్పించడానికి బీజేపీతో పాటు కలిసి సంయుక్తంగా కృషి చేస్తామని వీడియో సందేశాన్ని విడుదల చేశారు. చైనాతో యుద్ధమేఘాలు అలముకున్న సమయంలో ఇటీవల ప్రజలలో పెద్ద ఎత్తున ఇదే తరహా స్వదేశీ డిమాండ్ వినిపించింది. మరి ఆ ఆవేశం అప్పటికి మాత్రమే పరిమితమా లేక కరోనా సమయంలో అదే నిబద్ధతను ప్రజలు కొనసాగిస్తారా అన్నది వేచి చూడాలి.