గురువారం కృష్ణారివర్ మేనేజ్మెంట్ బోర్డును కలిసిన కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి.. ఓ వినతి పత్రం ఇచ్చి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలో.. దక్షిణ తెలంగాణ ప్రాజెక్టుల్ని కేసీఆర్ ఎంత వ్యూహాత్మకంగా నిర్వీర్యం చేస్తున్నారో వివరించారు. అదే సమయంలో.. విద్యుత్ ప్రాజెక్టులను హత్య చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. అయితే…ఆయన అలా ఆరోపించిన రోజు అర్థరాత్రి శ్రీశైలం విద్యుత్ ప్రాజెక్ట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. దీంతో రేవంత్ రెడ్డి తన ఆరోపణలకు మరింత పదును పెట్టి విమర్శలు గుప్పిస్తున్నారు.
శ్రీశైలం విద్యుత్ ప్రాజెక్టులో ప్రమాదం.. కుట్రలాగే కనిపిస్తోందని ఆయన అంటున్నారు. జగన్మోహన్ రెడ్డి జల దోపిడికి సహకరించేందుకు కేసీఆర్ ఇలా చేస్తున్నారేమోనని ఆయన అంటున్నారు. కుట్రను ప్రమాదం పేరుతో కప్పిపెట్టే ప్రయత్నం ఉందేమోనని అనిపిస్తోందని ఆరోపించారు. నిజానిజాలు తేలాలంటే ప్రమాదంపై పూర్తి స్థాయిలో … సీబీఐ విచారణ కావాలని అంటున్నారు. విద్యుత్ ప్రాజెక్టులను చంపేసే కుట్ర జరుగుతోందని తాను ముందే చెప్పానని రేవంత్ రెడ్డి అంటున్నారు.
ప్రమాదంలో కుట్ర ఏముంటుందో కానీ.. రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ ప్రతీ విషయంలోనూ ఆరోపణలు చేస్తూ ఉంటుంది. మొన్నటికి మొన్న కీసరలో ఓ అధికారి ఏసీబీకి చిక్కితే..అక్కడ ఏవో రేవంత్ పేపర్లు ఉన్నాయని ఆయనపై టీఆర్ఎస్అనుకూల మీడియాలోనూ విపరీతంగా ప్రచారం చేశారు. ఇప్పుడు.. తనకు అవకాశం వచ్చిందని రేవంత్ రెడ్డి ఆ తరహా ఆరోపణలు చేస్తున్నారు. అయితే విద్యుత్ ప్రాజెక్టులను చంపేసే కుట్ర జరుగుతోందని రేవంత్ అన్న రోజే ప్రమాదం జరగడం.. యాధృచ్చికం..!