గుణం లేని పాలకులు కులం గొడుగు పడతారు..!
మానవత్వం లేని పాలకులు మతాలను రెచ్చగొడతారు..!
పనితనం లేని పాలకులు ప్రాంతాల మధ్య చిచ్చు పెడతారు..!
…ఇది దశాబ్దాల కిందటే.. గుర్రం జాషువా చెప్పిన సత్యం. ఆయన కాలంలో అలాంటి పరిస్థితులు ఉన్నాయో లేవో కానీ.. ఇప్పుడు మాత్రం స్పష్టంగా కళ్ల ముందు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు.. కులమే రాజకీయం.. రాజకీయమే కులం. కులం, మతం లాంటి వాటికి అతీతంగా వ్యవహరించిన ముఖ్యమంత్రి, ఆయన సహచరమంత్రులు నేరుగా కులం గురించి తరచూ ప్రస్తావించే పరిస్థితి.
నెల్లూరు హాస్పిటల్ – రమేష్ హాస్పిటల్.. ! కులం కేస్ స్టడీ..!
అది పోలింగ్ ముగిసి ఎన్నికల ఫలితాలు రావాల్సిన సమయం. 2019 మే నెల. సీఎంగా చంద్రబాబే ఉన్నారు. కానీ సీఎస్‌గా ఈసీ నియమించిన ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉన్నారు. ఆరోగ్య శాఖలో సిన్సియర్ అధికారి పూనం మాలకొండయ్య ఉన్నారు. అప్పుడు నెల్లూరు లో ఓ ఆస్పత్రి… మృతదేహాల నుంచి అవయవాలను దొంగిలిస్తున్నట్లుగా తేలిపింది. పెద్ద దుమారం రేగింది. నిజమేనని తేలింది. కానీ ఆ హాస్పిటల్ రెడ్డి సామాజికవర్గానికి చెందినది. ఆ ఆస్పత్రిని సీజ్ చేయాలని… కేసు పెట్టాలన్న పూనం మాలకొండయ్య ఆదేశాలను కూడా .. ఎల్వీ పట్టించుకోకుండా చేశారు. ఎన్నికల ఫలితాలు రాక ముందే ఎల్వీ ద్వారా అప్పటికే అధికారయంత్రాంగాన్ని గుప్పిట్లో పెట్టేసుకున్న వైసీపీ పెద్దలు .. తమ సామాజికవర్గం.. తమ బంధువులకు చెందిన ఆ ఆస్పత్రిని కాపాడారు. ఇప్పటికీ ఆ ఆస్పత్రి యథేచ్చగా ఆ అవయవ వ్యాపారం చేస్తోందన్న ఆరోపణలు నెల్లూరులో వినిపిస్తున్నాయి. ఇంత వరకూ ఆ కేసు విచారణ ఏమయిందో తెలియదు. ఆ ఎపిసోడ్ ఇప్పుడు మర్చిపోయారు. ఇప్పుడు రమేష్ ఆస్పత్రి ఘటన. రమేష్ ఆస్పత్రి డాక్టర్ రమేష్‌బాబు ఆచూకీ చెబితే రూ. లక్ష ఇస్తామని విజయవాడ పోలీస్ కమిషనర్ ప్రకటించేశారు. ఆయనను ఓ ఉగ్రవాదిలా.. ఓ టెర్రరిస్టులు.. ఓ అసాంఘిక శక్తిలా చిత్రీకరించేశారు. ఇంతకీ ఆయన చేసిన పాపం ఏమిటి..?. కోస్తాలో గుండె జబ్బులకు ఓ మెరుగైన ఆస్పత్రి పెట్టడమా..? కరోనా కేసులు పెరుగుతూంటే.. ప్రభుత్వ సూచనల మేరకు వైద్య మౌలిక సదుపాయాలు పెంచడమా…?. ఆయన దగ్గర పెద్ద పెద్ద అధికారులు కూడా చికిత్స చేయించుకుని .. నయం చేయించుకుని వెళ్లడమా..?. స్వర్ణాహోటల్లో రమేష్ ఆస్పత్రి నిర్వహిస్తున్న క్వారంటైన్ సెంటర్లో ప్రమాదం జరిగింది. తప్పు ఎవరిది..? అనుమతులు ఇచ్చిన అధికారులదా..? ఎప్పటికప్పుడు పరిశీలించాల్సిన పని చేయని అధికారులదా..? సరైన నిర్వహణ చేపట్టని హోటల్ యాజమాన్యానిదా..? అక్కడ రోగుల్ని పెట్టిన రమేష్ ఆస్పత్రి యాజమాన్యానిదా..?. ఈ ప్రశ్నకు సమాధానం.. ఎవరిదీ కాదు… తప్పు అంతా కులానిది. ప్రమాదం జరిగిన తర్వాత కొన్ని వేల మందికి గుండె ఆపరేషన్లు చేసి ప్రాణం పోసిన పోతినేని రమేష్ బాబు అనే డాక్టర్ కాస్తా రమేష్ చౌదరి అయిపోయారు. అదే రమేష్ బాబు.. రమేష్ రెడ్డి అయితే.. ఈ సమస్య ఉండేది కాదని సులువుగా అర్థం చేసుకోవచ్చు. అంటే.. ఇక్కడ సమస్య అంతా…కులంలోనే ఉందన్నమాట.
ప్రభుత్వానికి ఏ ఇబ్బంది వచ్చినా పరిష్కార మార్గం కులమే..!
ఒక్క రమేష్ బాబు మాత్రమే కాదు.. ఏపీలో కులానిదే రాజ్యం. అతను ఆ కులానికి చెందినా చెందకపోయినా ఆ కులం ముద్ర వేయడమే రాజకీయం. కరోనా జాతీయ విపత్తుగా ప్రకటించిన తర్వాత ఎస్ఈసీగా ఉన్న రమేష్ కుమార్ స్థానిక ఎన్నికలను వాయిదా వేశారు. నిజానికి అప్పటి వరకూ జరిగిన ఎన్నికల ప్రక్రియపై… దాడులు.. దౌర్జన్యాలు జరుగుతున్నా…పట్టించుకోకపోవడం వంటి కారణాల వల్ల.. ఆయన ప్రభుత్వ కనుసన్నల్లో పని చేస్తున్నారని విమర్శలు ఎదుర్కొన్నారు. కోర్టు ఆగ్రహానికి కూడా గురయ్యారు. అప్పటి వరకూ ప్రభుత్వ పెద్దలకు ఆయన కులం గుర్తు రాలేదు. కానీ కరోనా కారణంగా వాయిదా వేసేసరికి.. ఆయన కులం గుర్తుకు వచ్చింది. వెంటనే ముఖ్యమంత్రి ఎప్పుడూ లేని విధంగా మీడియా ముందుకు వచ్చేసి..చంద్రబాబు సామాజికవర్గం కాబట్టే వాయిదా నిర్ణయం తీసుకున్నారని తేల్చేశారు. అంటే.. స్థానిక ఎన్నికల వాయిదాకు కారణం కులం..!. అమరావతి రాజధానిని తొలగించడం దగ్గర్నుంచి తెలుగు మీడియం రద్దు చేయడం వరకూ కారణం కులమే.
వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా పేరుకు తోక తగిలించి తిట్టెయ్యడమే..!
రాష్ట్రంలో ఏం జరిగినా.. దానికి ఓ కులమే కారణం అని ముద్ర వేయడానికి …ఆ వైఫల్యం నుంచి తాము బయటపడటానికి అధికార పార్టీ నేతలే నిర్మోహమాటంగా ప్రయత్నిస్తున్నారు. ఈ పధ్నాలుగు నెలల కాలంలో.. ఏపీలో ఏం జరిగినా…జరగకపోయినా దానికి కులం అంటించని సందర్భం లేదంటే అతిశయోక్తి కాదు. హైకోర్టు తీర్పులు వ్యతిరేకంగా వచ్చినా… ఉత్తరాది జర్నలిస్టులు ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా కామెంట్లు చేసినా.. ప్రసిద్ధ పారిశ్రామికవేత్తలు ఏపీ ప్రభుత్వ నిర్ణయాలను విమర్శించినా.. అందరికీ .. డాక్టర్ రమేష్‌కు తగిలించి మాట్లాడినట్లుగా పేరుకు చౌదరి అనే పేరు తగిలించి… విమర్శలు ప్రారంభించేస్తున్నారు. ఎంత దారుణంగా ఈ కులం వైరస్‌ను అధికార పార్టీ నేతలు వ్యాపింప చేస్తున్నారంటే.. ఓ సందర్భంలో టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబును విమర్శించడానికి… మంత్రి అనిల్ కుమార్ ఆయనను కూడా అశోక్ బాబు చౌదరి అని పార్టీ ఆఫీసులో ప్రెస్‌మీట్ పెట్టి.. నొక్కి చెప్పారు. నిజానికి అశోక్‌బాబు ఆ సామాజికవర్గానికి చెందిన నేత కాదు అని తెలియని రాజకీయ నేత ఎవరూ లేరు. కానీ కావాలనే.. ఓ రకమైన దురుద్దేశంతో మంత్రులే అలాంటి వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు.
నిరక్ష్యరాస్యత ఎక్కువున్న రోజుల్లోనే కులంపై అవగాహన..! ఇప్పుడు చదువుకున్న మూర్ఖులెక్కువ..!
ప్రతీ దానికి కులాన్ని ముందుకు తీసుకు వచ్చి ఎదురుదాడి చేస్తే ఏమవుతుంది..?. ఆ వైఫల్యం..ఆ ప్రమాదం నుంచి దృష్టి మళ్లించవచ్చు. కులంపై చర్చ ప్రారంభింవచ్చు. ఓ వైపు ఓ కులం..మరో వైపు మరో కులం తిట్టుకుంటూంటే.. టైంపాస్ చేయవచ్చు. ప్రజల్లో ఈ విభజన రేఖను శాశ్వతంగా ఉంచడం ద్వారా రాజకీయం చేయవచ్చు. ఏ కాస్త రాజకీయం తెలిసిన వారికైనా… తెలిసే లాజిక్ ఇది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వ పెద్దలు ఇదే ఫాలో అవుతున్నారు. పధ్నాలుగు నెలల కాలంలో ఎందుకు ఏమీ చేయలేపోయారంటే.. వారు చెప్పే కారణం కులమే. కాలం మారుతోంది. చదువుకున్న వారు పెరుగుతున్నారు. దాంతో చాలా మందికి కులం, మతం వంటి వాటిపై అవగాహన వచ్చి..మానవత్వం గురించి మాత్రమే తెలుసుకుంటారని అనుకుంటారు. కానీ పెద్దగా అక్షరాస్యత లేని కాలంలో ఉండే అభ్యుదయాలు … చదువుకున్న వారు పెరిగిపోయిన ఈ రోజుల్లో లేవు. ఇప్పుడు ఎంత చదువుకున్నా.. కులం, మతం మత్తు వారిని వదిలి పెట్టడం లేదు. ఫలితంగా రాజకీయ పార్టీల ఆటలు కూడా సాగుతున్నాయి. గతంలో రాజకీయ పార్టీలు కులాల రాజకీయాలు.. కేవలం ఎన్నికల సమయంలో.. టిక్కెట్లు ఇచ్చేటప్పుడు.. పదవుల పంపకంలోనే చూసేవి. ఇప్పటి రాజకీయంలో.. ఓ కులాన్ని టార్గెట్ చేసి.. వారిపైకి ఇతర కులాల్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవడం కీలకం అయింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో స్వయంగా ముఖ్యమంత్రి దీన్ని లీడ్ చేస్తున్నారు. ఇతర నేతలు… ఆ బాటలో ముందుకు నడుస్తున్నారు.
కులం లేని వాళ్లు ఎవరుంటారు..? కావాలని ఓ కులంలో పుట్టేవాళ్లుంటారా..?
కులం లేని వాళ్లెవరు ఉంటారు..? కావాలని ఎవరైనా ఓ కులంలో పుట్టగలరా..? నాకు కులం, మతం పట్టింపు లేదని ఎవరైనా అనుకున్నా.. నువ్ ఫలానా కులం అని సమాజం ముద్ర వేసేస్తుంది. ఆ కులాన్ని ఎవరూ చెరుపుకోలేరు. ప్రతి ఒక్కరికీ కులం ఉంటుంది. ఏ కులమూ గొప్ప కాదు..ఏ కులమూ తక్కువ కాదు. అన్ని కులాల్లోనూ ధనవంతులు ఉంటారు..పేదవాళ్లు ఉంటారు. కానీ సమస్య అంతా రాజకీయంతోనే వస్తుంది. తాము అనుభవిస్తున్న అధికారానికి ఆ పార్టీ నేత పోటీగా ఉన్నారంటే.. అతని కులాన్ని టార్గెట్ చేస్తే చాలనుకుంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు లీడర్‌గా ఉన్నారు కాబట్టి ఆయన కులాన్ని టార్గెట్ చేస్తున్నారు. కానీ.. మరో బీసీ నేత పోటీగా వస్తే ఆ బీసీ కులాన్ని అలాగే నిందించడం వంద శాతం జరిగే రాజకీయం. కులం పేరుతో రాజకీయం నడిపే వారికి అది చాలా సులువు. ఈ డైవర్షన్ రాజకీయాన్ని ప్రజలే అర్థం చేసుకుని చైతన్యవంతులవ్వాలి అప్పుడే ఈ కుల రక్కసి ఆగిపోతుంది. లేకపోతే క్యాన్సర్‌లా పాకిపోతుంది.