ఏపీలో పట్టణ ప్రాంతాలలో వార్డు వాలంటీర్ల వ్యవస్థను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకు వచ్చారు. పట్టణాల్లో వార్డుకో వాలంటీర్ను పెట్టి అక్కడి ప్రజలకు కావాల్సిన సేవలు అందిస్తారు. కొద్ది మార్పులతో అలాంటి వ్యవస్థను… తెలంగాణ పట్టణాల్లో ఏర్పాటు చేయడానికి కేటీఆర్ సన్నాహాలు ప్రారంభించారు. మున్సిపల్శాఖపై సమీక్ష జరిపిన కేటీఆర్ .. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా వార్డు ఆఫీసర్లను నియమించాలని నిర్ణయించారు. మున్సిపాలిటీల్లోని ప్రతివార్డులో ఆఫీసర్లను నియమిస్తామని స్పష్టం చేశారు. దేశంలోనే తొలిసారిగా వార్డుకు ఒక అధికారి నియామకం ఉంటుందని.. ప్రకటింటారు.
వార్డు ఆఫీసర్లు… పురపాలక చట్టం నిర్దేశించిన పారిశుద్ధ్యం, హరితహారంతో పాటు ఇతర కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేయడానికి కృషి చేస్తారు. వాస్తవానికి తెలంగాణ ప్రభుత్వం కొత్త మున్సిపల్ చట్టం తీసుకు వచ్చింది. కరోనా కారణంగా అమలు చేయడానికి ఆలస్యం అవుతున్నప్పటికీ.. ఆ చట్టం ప్రకారమే మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. పరిశుభ్రతకు… పచ్చదనానికి ప్రాధాన్యం ఇస్తూ ఆ చట్టం ఉంది. మొక్కలకు.. ప్రజా ప్రతినిధుల్ని బాధ్యుల్ని చేశారు. అయితే.. ఆ చట్టం ప్రకారం.. పాలన సాగాలంటే.. పర్యవేక్షణ వ్యవస్థ ఉండాల్సిందేనని.. ప్రజలకు అందుబాటులో ఓ ఉద్యోగి ఉండాలని నిర్ణయిచుకుని వార్డు ఆఫీసర్ల ఉద్యోగాన్ని సృష్టిస్తున్నట్లుగా తెలుస్తోంది.
తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇటీవలి కాలంలో… తన శాఖలు మాత్రమే కాదు… మొత్తం పాలనలో తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారు. అనూహ్యమైన మార్పులను తీసుకొస్తున్నారు. కరోనా సమయంలోనూ చురుగ్గా పర్యటిస్తూ… అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తున్నారు. గత కొంత కాలంగా హైదరబాద్ చుట్టుపక్కలా… వరుసగా ఫ్లైఓవర్లను ప్రారంభించారు. కొన్ని వేల కోట్లతో అభివృద్ధి పనులను జోరుగా సాగేలా చేస్తున్నారు. ఈ అభివృద్ధిని చిన్న పట్టణాలకూ విస్తరిస్తున్నారు.