బిఫోర్ కరోనా.. ఆఫ్టర్ కరోనా అని చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎంతో కాలం ఇలా ఊపిరి బిగబట్టే పరిస్థితి లేదు. అందుకే.. ఒక్కొక్క వ్యవస్థ ముందడుగు వేస్తోంది. ప్రజాస్వామ్యానికి పునాది అయిన ఎన్నికల విషయంలోనూ కరోనా మార్పులు ఖాయమయ్యాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడటంతో ఎన్నికలు నిర్వహించాడనికి ఎన్నికల సంఘం.. ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మార్గదర్శకాల ప్రకారం.. ఎన్నికల ప్రక్రియ మొత్తం ఆన్లైన్లో జరుగుతుంది. ఓటింగ్ మాత్రం.. ఎప్పట్లాగే ఉంటుంది. ఆన్ లైన్ ఓటు అవకాశం లేదు.
ముందుగా నామినేషన్ల ప్రక్రియను కూడా ఆన్ లైన్ చేశారు. ఆన్లైన్లోనే నామినేషన్ వేసి.. ప్రింట్ తీసి రిటర్నింగ్ అధికారికి ఇస్తే చాలు. డిపాజిట్‌ను కూడా ఆన్లైన్ ద్వారానే చెల్లించాలి. ఇక ఎన్నికల ప్రచారం విషయంలో కోవిడ్ నిబంధనలు అమలు చేస్తారు. ఐదుగురి కంటే ఎక్కువ గుమికూడకూడదు. ఇక కరోనా నిబంధనలు అమల్లో ఉన్నంత కాలం.. రాజకీయ సభలు, సమావేశాలు.. బహిరంగసభలు.. రోడ్ షోలు.. జరగడానికి అవకాశం లేదు. ఒక వేళ ప్రభుత్వం కరోనా నిబంధనలు ఎత్తివేస్తే.. అప్పుడు మళ్లీ రాజకీయ కోలాహలం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అలాగే.. ఓటు వేసే ప్రతి ఒక్కరికి గ్లౌజులు ఇవ్వాలనే నిబంధనల పెట్టారు. పోలింగ్ కేంద్రంలోకి ప్రవేశ/ నిష్క్రమణ ప్రదేశాల్లో శానిటైజర్లు, సబ్బులు, నీరు అందుబాటులో ఉంచాలి.
ఇక కరోనా రోగులకు ఓటు ఎలా అనే ఓ సందేహం చాలా మందికి ఉంటుంది. అలాంటి వారికి చివరి గంటలో ఓటు వేసేందుకు వీలుగా టోకెన్లు జారీ చేస్తారు. 80 ఏళ్లు దాటిన వారికీ అంతే. ఇక కౌంటింగ్ సమయంలోనూ నిబంధనలు పెట్టారు. చాలా పరిమితంగా టేబుళ్లను ఏర్పాటు చేస్తారు. వీవీ ప్యాట్లను లెక్కించేటప్పుడు శానిటైజ్ చేస్తారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. కరోనా వ్యాప్తిని అరికట్టడం అంత తేలిక కాదు. ఎన్నికల్లాంటి ప్రక్రియలో అయితే.. మాస్ గా వ్యాప్తి చెందడానికి అవకాశం ఉంది. అయినా.. ఎన్నికలు నిలిపివేయడానికి అవకాశం లేదు.