తెలంగాణ ఆర్థిక మంత్రి హరీష్ రావు రాజకీయాల్లో తీరిక లేకుండా ఉంటారు. ఆయన ప్రత్యేకంగా ఏమైనా వ్యాపారాలు చేస్తున్నారనే విషయం ఎవరికీ తెలియదు. ఆయన ఎన్నికల అఫిడవిట్లోనూ తనకు వ్యాపారాలు ఉన్నాయని చెప్పలేదు. అయితే తనకు ఆర్థిక భరోసా కావాలనుకున్నారో… రాజకీయాల్లో పడి తమకు అలాంటి భద్రత కల్పించడం గురించి పట్టించుకోవడం లేదనుకున్నారో కానీ.. హరీష్ రావు భార్య శ్రీనిత వ్యాపార రంగంలోకి అడుగు పెట్టారు. ఆమె… డెయిరీ వ్యాపారంలోకి అడుగు పెట్టారు. ప్రత్యేకంగా మిల్చీ మిల్క్ బ్రాండ్‌తో పాలను మార్కెట్లోకి విడుదల చేశారు. సాదాసీదాగా జరిగిన కార్యక్రమంలో కంపెనీ ఉద్యోగులతో కలిసి.. ఈ బ్రాండ్‌ను మార్కెట్లోకి వదిలారు.
కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రతీ ఒక్కరూ రోగ నిరోధక శక్తిని పెంపొందించుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని శ్రీనిత చెబుతున్నారు. తమ బ్రాండ్ మిల్చి మిల్క్ స్వచ్ఛమైన తాజా పాల సేకరణ, ప్రాసెసింగ్, ప్యాకింగ్, సప్లై పూర్తి హైజెనిక్ పద్దతిలో ఉంటుందని.. వినియోగ దారులు సంపూర్ణంగా నమ్మదగిన పాల ఉత్పత్తులని భరోసా ఇస్తున్నారు. అనుభవజ్ఞులైన ఉద్యోగుల పర్యవేక్షణలో చిల్లింగ్ కేంద్రాలు, బల్క్ కూలర్లు మరియు ప్యాకింగ్ స్టేషన్ల ద్వారా వినియోగదారులకు నాణ్యమైన పాలను అందిస్తామని చెబుతున్నారు.
పాల వ్యాపారంలో.. డెయిరీ కంపెనీలు పెట్టి మరీ ఆర్థిక భరోసా కోసం ప్రయత్నిస్తున్న రాజకీయ కుటుంబాల్లో… హరీష్ రావు ఫ్యామిలీ కూడా లెక్కల్లోకి వచ్చింది. ఇప్పటికి టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబానికి హెరిటేజ్ కంపెనీ ఉంది. దాదాపుగా 30 ఏళ్ల కిందట చిన్న స్థాయిలో ప్రారంభమైన ఆ కంపెనీ ఇప్పుడు కార్పొరేట్ లెవల్‌కు ఎదిగింది. రాజకీయాల్లో తీరిక లేకుండా ఉండే చంద్రబాబు ఆ వ్యాపారాన్ని పట్టించుకోలేదు. మొత్తం.. ఆయన సతీమణినే చూసుకున్నారు. ఇప్పుడు హరీష్ రావుకు కూడా అంత తీరిక ఉండదు.. హరీష్ రావు భార్యనే చూసుకోనున్నారు.