విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ ను పధ్నాలుగు నెలల్లో కట్టేశామని… ముఖ్యమంత్రితో రిబ్బన్ కట్ చేయించడానికి సిద్ధమైన వైసీపీకి ఢిల్లీ నుంచి షాక్ తగిలింది. వచ్చే నెల నాలుగో తేదీన తాను ఫ్లైఓవర్‌ను ప్రారంభించబోతున్నట్లు కేంద్రమంత్రి గడ్కరీ ఏపీ సర్కార్‌కు సమాచారం పంపారు. దుర్గగుడి ఫ్లైఓవర్ నిధులన్నీ కేంద్రానివే. భూసేకరణ మాత్రం చంద్రబాబు హయాంలో జరిగింది. ఇప్పుడు పూర్తయింది. దీన్ని జగన్ ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. విజయవాడ-మచిలీపట్నం రహదారి విస్తరణలో భాగంగా బెంజ్ సర్కిల్ ఫ్లై ఓవర్ ను కూడా కేంద్రం గతంలోనే మంజూరు చేసింది. బెంజ్ సర్కిల్ లో రెండోవైపు ఫ్లై ఓవర్ కోసం టెండర్లను సైతం పిలిచారు. విజయవాడకు బైపాస్ రోడ్ కోసం కేంద్రం నిధులిచ్చింది.
ప్రస్తుతం ఈ ఫ్లై ఓవర్ల ప్రారంభోత్సవం, బెంజ్ సర్కిల్ లో రెండో ఫ్లై ఓవర్ కు శంకుస్థాపనకు ఏర్పాట్లు చేశారు. అయితే ఈ ఫ్లై ఓవర్లను ముఖ్యమంత్రి జగన్ తో ప్రారంభింపచేయాలని నిర్ణయించారు. ఇటీవల మంత్రులు వరుసగా ఫ్లైఓవర్‌ను పరిశీలిస్తూ.. జగన్ పధ్నాలుగు నెలల్లో పూర్తి చేశారని చెప్పుకోవడం ప్రారంభించారు. దీంతో విజయవాడ ఎంపీ కేశినేని నాని నేరుగా ఢిల్లీ వెళ్లిపోయారు. ప్రారంభోత్సవాలు.. శంకుస్థాపనలు చేయాలని గడ్కరీని కోరారు. వీటన్నింటిని తాను స్వయంగా వచ్చి ప్రారంభిస్తానని ఒక వేళ కుదరకపోతే.. ఆన్ లైన్ లో సెప్టెంబర్ 4వ తేదీన ప్రారంభిస్తానని నితిన్ గడ్కరీ.. ఎంపీ కేశినేని నానికి హామీ ఇచ్చారు.
ఇప్పుడు గడ్కరీ షెడ్యూల్ ఖరారయ్యే వరకూ నాని ఢిల్లీలోనే ఉన్నారు. వీటన్నింటిని గడ్కరీ ప్రారంభిస్తారని ఆయన కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించేలా చేయగలిగారు.. సెప్టెంబర్ 4వ తేదీన వీటిన్నిటికీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారని కూడా అందులో పేర్కొన్నారు. దీంతో ప్రభుత్వానికి షాక్ తగిలినట్లయింది. ఇప్పుడు ముఖ్యమంత్రి రిబ్బన్ కట్ చేయలేరు. గడ్కరీ చేస్తారు. అంటే.. క్రెడిట్ కూడా పెద్దగా రాదు. ఇప్పటి వరకూ గత ప్రభుత్వం కట్టించిన వాటికి ప్రారంభోత్సాలు.. రంగులు వేసుకుంటూ కాలం గడిపిన ఏపీ సర్కార్‌కు.. ఇప్పుడు ఫ్లైఓవర్ విషయంలో మాత్రం.. గడ్డు పరిస్థితి ఎదురయినట్లయింది.