తెలంగాణలో ఏ రాజకీయ పోరాటం చేయాలనుకున్న కాంగ్రెస్ నేతలకు ముందుగా పోలీసులు అడ్డం వచ్చేస్తున్నారు. చిన్న ధర్నా చేద్దామన్నా… ఇంట్లో నుంచి బయటకు రాకుండానే అరెస్ట్ చేస్తున్నారు. తాజాగా శ్రీశైలం వెళ్లి అక్కడి పరిస్థితుల్ని పరిశీలించి బాధిత కుటుంబాలకు ధైర్యం చెబుదామనుకుని బయలుదేరిన ఎంపీ రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నేత మల్లు రవిలను పోలీసులను మధ్యలోనే అరెస్ట్ చేశారు. అక్కడ సీఐడీ దర్యాప్తు జరుగుతోందని… అందుకే వెళ్లొద్దని పోలీసులు విచిత్రమైన కారణం చెప్పడంతో రేవంత్ రెడ్డి భగ్గుమన్నారు. తాము చట్టాలు చేసే వాళ్లమని.. సంఘవిద్రోహ శక్తులం కాదని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.
తాను ఎంపీనని నల్లమల బిడ్డను.. ఈ ప్రాంతంలో తిరిగే హక్కు తనకుందని రేవంత్ పేర్కొన్నారు. అయితే పోలీసులు బలవంతంగా వారిని అరెస్ట్ చేసి తరలించారు. రేవంత్ రెడ్డి అరెస్ట్‌పై ఉత్తమ్ సహా కాంగ్రెస్ నేతలంతా స్పందించారు. ప్రజాస్వామ్య గొంతుకను..టీఆర్ఎస్ ప్రభుత్వం నులిమేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గవర్నర్‌కు ఓ లేఖ రాశారు. శ్రీశైలం పవర్‌ప్లాంట్‌లో ప్రమాదం పూర్తిగా మానవ నిర్లక్ష్యమేనని దీనికి.. మంత్రి జగదీష్‌రెడ్డి, సీఎండీ ప్రభాకర్‌రావు బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. వారిద్దరిపై చర్యలు తీసుకోవాలని సీఎంను ఆదేశించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.
అలాగే ఘటనపై సీబీఐ విచారణ కోరాలని .. బాధిత కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు. బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తుంటే అరెస్ట్ చేసి..రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని మండిపడ్డారు. విద్యుత్ ప్రాజెక్ట్ ప్రమాదంపై రేవంత్ రెడ్డి చాలా దూకుడుగా ఆరోపణలు చేస్తున్నారు. ఉత్తమ్ సహా ఇతర కాంగ్రెస్ నేతలు… ప్రభుత్వాన్ని విమర్శించలేదు కానీ… కుట్ర కోణంలో రేవంత్ రెడ్డి దూకుడుగా వెళ్తున్నారు.