మాతృభాషపై మమకారం ఎలా ఉంటుందో… తమిళులు చూపిస్తున్నారు. ఇతర భాషల్ని రుద్ది.. మాతృభాషను మెల్లగా చంపేసే కుట్ర జరుగుతోందని ఆందోళనకు సిద్ధమయ్యారు. దక్షిణాది రాష్ట్రాల్లో హిందీని కేంద్రం బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తోందని తమిళ నేతలు మండిపడుతున్నారు .తమిళనాడులో మళ్లీ హిందీ వ్యతిరేక భావజాలం పెరుగుతోంది. దీనికి స్థానిక నేతలు మరింత ఆజ్యం పోస్తున్నారు. ఎయిర్పోర్ట్లో సీఐఎస్ఎఫ్ అధికారి ఎంపీ కనిమోళిని హిందీ రాకపోతే భారతీయులు కాదన్నట్లుగా మాట్లాడటంతో భగ్గుమన్నారు ఎంపీ కనిమోళి. హిందీ మాట్లాడితేనే భారతీయులా..? అంటూ మండిపడ్డారు. ఇప్పుడు తమిళనాడు ఆయుష్ ఉద్యోగులను ఉద్దేశించి ఓ సమావేశంలో ఆ శాఖ సెక్రటరీ హిందీ అర్థం కాని వాళ్లు ఇక్కడి నుంచి వెళ్లిపోవచ్చని చెప్పేశారు. ఇది మరింత వివాదస్పదం అయింది.
తమ మాతృభాషపై ఈగ వాలినా సహించని తమిళ నేతలు… ఈ పరిణామాలపై మండిపడుతున్నారు. కనిమోళి మాత్రమే కాదు.. కమల్ హాసన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ.. గవర్నర్ మెంట్ ఆఫ్ హిందీ కాదంటూ ట్వీట్ చేశారు కమల్. కేంద్ర ప్రభుత్వం అందరికీ అర్థమయ్యే భాషలోనే ఆపరేట్ చేయాలని అన్నారు. ఆయుష్ సెక్రటరీ తమిళ డాక్టర్లను అవమానించారని అన్నారు. వరుసగా జరుగుతున్న ఇలాంటి ఘటనలతో తమిళనాడులో హిందీ వ్యతిరేక రాజకీయం హీటెక్కుతోంది.
సీఐఎస్ఎఫ్ అధికారిని ఇంగ్లీష్ లేదా తమిళ్లో మాట్లాడమన్నందుకు తనను అవమానించారని.. హిందీ రాని వాళ్లు భారతీయులే కాదన్నట్లు మాట్లాడరని కనిమోళి ఇటీవల ఫిర్యాదు చేశారు. ఇప్పుడు ఆయుష్ సెక్రటరీ వ్యవహారంతో అక్కడి హిందీ వ్యతిరేక వాదం పెరుగుతోంది. ఇప్పటికే హిందీని బలవంతంగా రుద్దుతున్నారంటూ అక్కడి పార్టీలు పోరాటం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి పళని స్వామి సైతం.. కేంద్రం ప్రకటించిన త్రిభాషా విద్యా విధానాన్ని వ్యతిరేకించారు. రాను రాను అక్కడ మాతృభాష ఉద్యమం తీవ్రం అయ్యే అవకాశం ఉంది. కానీ ఏపీలో మాత్రం మాతృభాషపై కులం ముద్రవేసినా… భాషోద్దారకులు సైతం… అహో.. ఓహో అంటూ… పదవులతో కాలక్షేపం చేస్తున్నారు.