వంగవీటి రాధా త్వరలోనే బిజెపిలో చేరబోతున్నాడని, కేంద్రమంత్రి స్థాయి వ్యక్తి బిజెపీ తరఫున రాధాతో ఇటీవల చర్చలు జరిపాడని, బిజెపిలోకి త్వరలోనే వంగవీటి రాధ చేరబోతున్నారని రాజకీయ వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే బిజెపి తరఫున వంగవీటి రాధాకు మరీ ఎక్కువ సీన్ ఇస్తున్నారా అన్న విశ్లేషణ కూడా మరొకవైపు మొదలైంది. వివరాల్లోకి వెళితే..
వాస్తవంగా చూసుకుంటే ప్రస్తుతం వంగవీటి రాధా రాజకీయ నిరుద్యోగి కిందే లెక్క. ప్రజారాజ్యం పార్టీలో, ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ లో, 2019 ఎన్నికలకు ముందు టిడిపిలో ఆయన ఉన్నారు. వంగవీటి మోహన రంగా అనంతరం ఆయన రాజకీయ వారసుడిగా ఒక వర్గం భావించే వంగవీటి రాధా తన రాజకీయ జీవితం తన చేతులతో తానే పాడు చేసుకున్నాడు అన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ప్రజా రాజ్యం తర్వాత వైఎస్ఆర్సిపి లో చేరి చాలా కాలం పాటు అత్యంత క్రియాశీలకంగా ఉన్న వంగవీటి రాధా, సరిగ్గా ఎన్నికల సమయంలో ఆ పార్టీని వీడి టిడిపిలో చేరి పొరపాటు చేశారని ఆయన అభిమానులు కొన్నిసార్లు వాపోతుంటారు. దాని కంటే ముఖ్యంగా టిడిపిలో చేరిన కొత్తలో ఆయన తన తండ్రి హత్య విషయంలో టీడీపీకి పూర్తిగా క్లీన్ చిట్ ఇవ్వడం కూడా రాజకీయపరంగా ఆయనకు మెచ్యూరిటీ లేదన్న విషయాన్ని సూచిస్తోందని ఇంకొందరు అభిప్రాయ పడుతుంటారు. తిరిగి వైసీపీ కి వెళ్లలేక, టిడిపిలో ఉండలేక, ఆ మధ్య నాదెండ్ల మనోహర్ ని కలిసినప్పుడు జనసేనలోకి వెళ్తారని జోరుగా ప్రచారం జరిగినా, అది కూడా కార్యరూపం దాల్చలేదు. వీటన్నింటి ప్రకారం చూసుకున్నా, సొంత నియోజకవర్గంలో 2019 ఎన్నికలలో ఆయన ఓటమి పాలవడం ని పరిగణలోకి తీసుకున్నా, వంగవీటి రాధా కి ఎర్రతివాచీ పరిచి పార్టీలోకి తీసుకునే పరిస్థితి ఏ పార్టీలోనూ లేదన్న విషయం అర్థమవుతుంది.
అయితే ఇటువంటి వంగవీటి రాధా తో, కేంద్ర మంత్రి స్థాయి కలిగిన వ్యక్తి తన ని బిజెపి లోకి తీసుకురావడానికి మంతనాలు జరిపారు అన్న వార్తలు రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యాన్ని కలిగించాయి. నిజంగా బిజెపిలోకి వంగవీటి ని ఆహ్వానించాలి అనుకుంటే రాష్ట్ర స్థాయి నాయకులు ఎవరు ఫోన్ చేసి పీలిచినా సరిపోతుందని అనవసరంగా బిజెపి నాయకులు, వంగవీటి రాధాకు పార్టీలో చేరకముందు నుండే ఎక్కువ సీన్ ఇస్తున్నారని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
అయితే మరొక వర్గం విశ్లేషకులు మాత్రం భిన్నమైన వాదన వినిపిస్తున్నారు. బిజెపీ వ్యూహాత్మకంగా నే వంగవీటి రాధా ను తెరపైకి తీసుకు వస్తోందని, ఓవైపు జనసేనతో చెలిమి, మరొకవైపు పార్టీ అధ్యక్ష పగ్గాలు సోము వీర్రాజు కు ఇవ్వడం, ఇప్పుడు- కాపుల లో ఒక ఐకాన్ లా అప్పట్లో వెలిగిన వంగవీటి మోహన రంగా తనయుడిని తెర మీదకు తీసుకు రావడం – ఇదంతా ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారమే బీజేపీ అమలు చేస్తోందని వారంటున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రెండు ప్రధాన పార్టీలు 2 వర్గాల గుప్పిట్లో ఉంటూ ఉంటాయన్న విశ్లేషణల నేపథ్యంలో మూడో వర్గాన్ని పూర్తిగా తమ వైపుకు తిప్పుకోవడానికి బిజెపి వ్యూహాలు రచిస్తోంది అని, కర్ణాటకలో మొదట్లో జెడిఎస్ వైపునున్న లింగాయత్ ల ను, యడ్యూరప్ప ను ముఖ్యమంత్రి చేయడం ద్వారా పూర్తిగా గా తమ వైపు తిప్పుకొని, ఇప్పుడు ఆ వర్గాన్ని తమకు బలమైన ఓటు బ్యాంకుగా మార్చుకుందని, అదే తరహా వ్యూహాన్ని ఆంధ్రప్రదేశ్లో అమలు చేయడానికి బిజెపి ప్రయత్నిస్తోందని వారంటున్నారు.
ఒకవేళ ఇదే గనక బిజెపి ప్రధాన వ్యూహం అయితే, దాన్ని ఏ విధంగా అమలు చేస్తుంది, ఆంధ్రప్రదేశ్లో ఎదగడానికి ఇవి బిజెపికి ఏ మేరకు ఉపయోగపడతాయి అన్నది భవిష్యత్తులో తెలుస్తుంది