గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ ఇప్పుడు.. దేశంలో సమస్యల విషయంలో కేంద్రంతో పోరాడటం కన్నా… తమలో తాము పోరాడుకోవడానికి ఎక్కువ సమయం వెచ్చిస్తోంది. ఒక దాని వెంట ఒకటి స్వయం కృతంతో సమస్యలు కొని తెచ్చుకుంటూ.. రోజు రోజుకు కునారిల్లిపోతోంది. పార్టీ భవిష్యత్‌పై ఎవరికీ నమ్మకం లేకుండా పోయేలా చేసుకుంటోంది. గత లోక్‌సభ ఎన్నికల తర్వాత రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవి నుంచి వైదొలిగారు. ఆయన పార్టీ నేతల తీరుపై అసంతృప్తిగా ఉన్నారు. ఎవరికి వారు వ్యక్తిగత రాజకీయ లాభానికే ప్రాదాన్యం ఇస్తున్నారని పార్టీ కోసం పని చేయడం లేదని ఆయన ఫీలయ్యారు. అందుకే పార్టీ పదవికి గుడ్ బై చెప్పారు. ఎంత మంది చెప్పినా ఆయన వెనక్కి తగ్గలేదు. ఊరకనే… ప్రత్యామ్నాయం లేదు కాబట్టి… ఆయన బెదిరిస్తున్నారని అందరూ అనుకున్నారు. కానీ రాహుల్ మాత్రం… తన రాజీనామాకు కట్టుబడ్డారు. దాంతో అనారోగ్యంతో ఉన్నప్పటికీ.. సోనియా గాంధీ మరోసారి బాధ్యతలు చేపట్టక తప్పలేదు.
ఇప్పుడు ఆమె పదవి కాలం కూడా పూర్తవుతోంది. మరోసారి సోనియా అధ్యక్షురాలిగా ఉండే అవకాశం లేదు. పదవీ కాలం పూర్తయ్యే వరకూ కూడా ఉండకుండా పదవి నుంచి వైదొలగాలని ఆమె అనుకుంటున్నారు. దీంతో ఇప్పుడు కాంగ్రెస్‌లో కొత్త అధ్యక్షుని ఎంపిక రచ్చ ప్రారంభమయింది. పార్టీ దీర్ఘ కాల ప్రయోజనాలను చూసుకుని అధ్యక్షుడిని ఎంపిక చేయాలంటూ.. సీనియర్లు లేఖ రాయడంతో.. ఈ అధ్యక్ష పదవి రచ్చ తారస్థాయికి చేరినట్లయింది. ఇప్పటికే ప్రియాంకా గాంధీ కూడా.. గాంధీ కుటుంబం నుంచి మాత్రమే ఉండాలనే నియమం ఏమీ లేదని.. ఎవరు ఉన్నా అభ్యంతరం లేదని ప్రకటించేశారు. ఈ కారణంగా చాలా మంది పేర్లు ప్రచారంలోకి వస్తున్నాయి.
ఈ సారి పార్టీ అధ్యక్ష పదవిని దక్షిణాదికి కేటాయిస్తారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో… కేరళ నేత శశిథరూర్ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. యువ నేతల పేర్లూ ప్రచారంలోకి వస్తున్నాయి. అసలు ట్విస్ట్ ఏమిటంటే.. బీజేపీలో చేరేందుకు సిద్దమై.. కావాల్సినంత బలాన్ని పొందలేక ఆగిపోయిన సచిన్ పైలట్ పేరు కూడా… పార్టీ అధ్యక్ష పదవికి వినిపిస్తోంది. రాహుల్ రాజీనామా చేసినప్పుడే పైలట్ తో పాటు బీజేపీలో చేరిపోయిన జ్యోతిరాదిత్య సింధియా పేరు కూడా వినిపించింది. కానీ గాంధీ కుటుంబం ఆలోచన వేరేలా ఉంది. దాంతో అప్పట్లో సోనియా గాంధీ చేతికే తాత్కాలిక అధ్యక్ష పదవి చేరింది.
కాంగ్రెస్ పార్టీకి ఈ సారి గాంధీయేతర అధ్యక్షడ్ని ఎంపిక చేయవచ్చు. కానీ ఇలా చేసేది.. సోనియా, రాహుల్ అనుమతితోనే. అంటే.. గతంలో ప్రధానిగా మన్మోహన్ సింగ్‌ను నియమంచినట్లే అవుతుంది. కాంగ్రెస్ పార్టీ నిలబడాలంటే.. గాంధీ కుటుంబమే పిల్లర్‌గా ఉండాలి. ఉంటుంది కూడా. మధ్యలో ఎవర్ని నిలబెట్టినా.. వారి ఆదేశాల ప్రకారమే నడవాలి. అలాంటప్పుడు.. గాంధీ కుటుంబం నుంచే అధ్యక్షుడు ఉండే సరిపోతుంది కదా… అని కొంత మంది వాదిస్తున్నారు. అలాంటి వారి చాయిస్ ప్రియాంకా గాంధీ. ఎవరు అధ్యక్షుడవుతారో క్లారిటీ వచ్చినా… పార్టీ నడిచేది మాత్రం గాంధీల ఆదేశాలతోనే..!