హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ… తన నియోజకవర్గ ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు. కరోనా వైరస్ విషయంలో ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు తన వంతు సాయం చేస్తున్నారు. గతంలో ప్రభుత్వాసుపత్రికి వెంటిలేటర్లను డొనేట్ చేసిన బాలకృష్ణ.. ఈ సారి హిందూపురం కోవిడ్ సెంటర్‌కు రూ. 55 లక్షల విరాళం పంపారు. దీంతో.. కరోనాపై పోరాటానకి అవసరమైన పీపీఈ కిట్ల దగ్గర్నుంచి కీలకమైన వైద్య పరికరాల వరకూ అన్నీకొనుగోలు చేయనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ఎక్కువగా కరోనా ప్రభావం ఉన్న జిల్లాల్లో అనంతపురం ఒకటి. బెంగళూరుకు అతి సమీపంలో ఉండటంతో.. హిందూపురంలోనూ కరోనా కేసులు అత్యధికం నమోదవుతున్నాయి. ప్రభుత్వం ఎన్ని సౌకర్యాలు చేపట్టినా… పెరుగుతున్న కేసుల సంఖ్య కారణంగా అందరికీ… చికిత్స అందించలేకపోతోంది. తాత్కాలిక ఆస్పత్రులు ఏర్పాటు చేసినా.. మౌలిక సదుపాయాలు కల్పించడం కష్టంగా మారింది. హిందూపురంలో పరిస్థితిని గమనించిన బాలకృష్ణ.. ప్రజలకు భరోసా ఇవ్వాలనుకున్నారు. ప్రభుత్వం చేసే ఖర్చుకు తోడు.. తన సొంత డబ్బును వెచ్చిస్తున్నారు. సాధారణంగా ప్రతిపక్ష నేత ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగవు. ప్రభుత్వం హిందూపురం నియోజకవర్గంలో పరిస్థితి అలానే ఉన్నా… బాలకృష్ణ సొంత నిధులు వెచ్చిస్తున్నారు.
ఏపీలో పెద్ద ఎత్తున పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అన్ని జిల్లాల్లోనూ అదే పరిస్థితి. సరైన సమయంలో వైద్యం అందక.. పెద్ద ఎత్తున ప్రాణాలూ పోతున్నాయి. ప్రభుత్వం ఎంత చేసినా.. చేయడానికి ఇంకా మిగిలే ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ప్రజా ప్రతినిధులు ముందుకు రావాల్సి ఉంది. తెలంగాణలో వంద అంబులెన్స్‌లను ప్రజాప్రతినిధులు సమకూర్చారు. కానీ ఏపీలో బాలకృష్ణ మాత్రమే వ్యక్తిగత బాధ్యత తీసుకుని సొంత నిధులను వెచ్చిస్తున్నారు. ఇతర నేతలెవరూ పట్టించుకవడం లేదు.