ఎన్ని కష్టాల్లో ఉన్న ప్రశాంతత కోల్పోతే … జరిగేది నష్టమే. అందుకే ప్రశాంతంగా ఉండాలి. ఎలాంటి పరిస్థితులు ఉన్న వారంతాల్లో హాయిగా గడపాలి. మనసకు నచ్చిన పనులు చేయాలి. అప్పుడు మాత్రమే సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఇది… మానసిక నిపుణులు చెప్పే సూక్తులు మాత్రమే కాదు.. దేశ ప్రధాని నరేంద్రమోడీ ఆచరణలో చూపిస్తున్న సత్యం. ఆయన నిన్న షేర్ చేసిన వీడియో దేశ ప్రజల్ని విశేషంగా ఆకర్షించింది. ఆయన తన దినచర్యలో నెమళ్లకు ఆహారం పెట్టడాన్ని ఓ భాగంగా మార్చుకున్నారు. ఆయన వీడియో ఎంతో మందిని ఆకర్షించింది. దేశానికి అలాంటి ప్రశాంతమైన ప్రధాని ఉంటే సమస్యలకు వాటంతటకు అవే పరిష్కార మార్గాలు వస్తాయని అంటున్నారు.
దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని చాలా మంది ఆందోళనలో ఉన్నారు. కరోనా వైరస్ కారణంగా ఆర్థిక వ్యవస్థ మైనస్‌లోకి వెళ్లిపోయింది. రెండున్నర కోట్ల వరకూ ఉద్యోగాలు పోయాయి. మళ్లీ ఎప్పుడు పుంజుకుంటుందో తెలియని పరిస్థితి. దీని వల్ల సహజంగా… ప్రజలందరిలో ఓ రకమైన ఆందోళన ప్రారంభమయింది. ఇది వారి మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది. భవిష్యత్‌పై భయంతో ఇప్పుడే ప్రాణాలు తీసుకుంటున్నారు. ఆత్మహత్యల సంఖ్య పెరిగిపోతోంది. అదే సమయంలో.. కరోనా కారణంగా చనిపోతున్న వారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. భయం వల్ల ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని… నిపుణులు చెబుతున్నారు. ఈ భయాన్ని అధిగమించాలంటే… ప్రశాంతత ముఖ్యం. దాన్ని ప్రధాని మోడీ నేర్పిస్తున్నారు.
సమస్యలు ఎలా వస్తాయో అలా పోతాయి. దాని కోసం ప్రభుత్వాలు ప్రత్యేకంగా చేయాల్సిన పనేం ఉండదు. కరోనా వైరస్ వస్తుందని ప్రభుత్వాలు అంచనా వేయలేదు. పోతుందని కూడా.. చెప్పలేకపోతున్నాయి. ప్రభుత్వాల పని ఆ వైరస్ నుంచి ప్రజల్ని వీలైనంతగా రక్షించడం. అందుకే కేంద్ర ప్రభుత్వం.. రోగులకు పకడ్బందీ చికిత్సకు ఏర్పాట్లు చేసింది. పీఎం కేర్స్ ఫండ్ ను సేకరించి.. దేశం నలుమూలల నుంచి విరాళాలు సేకరించి.. మౌలిక సదుపాయాలు పెంచారు. వైరస్‌ను గెలిచేంత దగ్గరకు ఇప్పుడు దేశం వచ్చింది. త్వరలో వ్యాక్సిన్ వస్తే.. విజయం కూడా పూర్తవుంది. ఇలాంటి సమయంలో.. విజయం కోసం ఎదురు చూస్తూ.. కూర్చోవడం కన్నా చేయగలిగిందేమీలేదు. కానీ అలా కూర్చోవడం కన్నా.. మానసిక ఆనందం పొందడం చాలా ముఖ్యం. ఇప్పుడు మోడీ అదే చేస్తున్నారు..!