న్యూఢిల్లీలోని సిపిఐ(ఎం) కేంద్ర కార్యాలయం ఎకెగోపాలన్ భవన్‌పై కొందరు దుండగులు దాడి చేసి బోర్డుకు రంగు పూసి నినాదాలు రాయడం రాజకీయ వేడిని మరింత పెంచుతున్నది. దేశద్రోహులారా తప్పుకోండి అని, పాకిస్తాన్ ముర్దాబాద్ అనీ వారు నినాదాలిచ్చారు. జెఎన్‌యు ఘటనల నేపథ్యంలో ఈ దాడి జరిగిందని భావిస్తున్నారు. దేశంలో ఒక ప్రధాన రాజకీయ పార్టీ కేంద్ర కార్యాలయంపైనే దాడి జరగడం ఖండనార్హమైంది. వారిలో ఒకరిని అక్కడున్నకార్యకర్తలు పట్టుకున్నారు. తను ఆమ్ ఆద్మీ సేనకు సంబంధించిన వాడనీ, పోలీసు వర్గాలు మీడియాకు చెబుతున్నాయి.నిజంగా సంబంధం లేదనుకుంటే దేశంలో యువతపై అసహన ప్రచారాల ప్రభావం ఎంత తీవ్రంగా వుందో అర్థమవుతుంది. ఇదివరకు కూడా ఆరెస్సెస్ వారు కేరళలోని కన్ననూర్ ఘటనలకు నిరసన పేరిట ఎకెజి భవన్‌పై దాడి చేశారు.హైదరాబాదులో సుందరయ్య విజ్ఞాన కేంద్రంపైనా దాడి చేసి ఆయన చిత్రపటాన్ని పాడుచేసేందుకు ప్రయత్నించారు. విజ్ఞాన కేంద్రం ఆడిటోరియంను మరో పేరుతో అద్దెకు తీసుకుని లోపల వుండి దాడి నడిపించారని సిపిఎం అప్పట్లో ఆరోపించింది. గతంలో గాంధీజీని హత్య చేసిన గాడ్సే కూడా ఆరెస్సెస్‌నుంచి వైదొలగి మరో హిందూ తీవ్ర వాద సంస్థ పెట్టుకున్నాడని చెబుతుంటారు. కాని సంఘ పరివార్ గాడ్సే గొప్ప దేశభక్తుడని కితాబులిస్తూనే వుంది. కనుక ఈ దాడిలో పరోక్ష ప్రత్యక్ష భాగస్వాములెవరన్నది విచారణలో తేల్చాలి. ఒక జాతీయ పార్టీ కేంద్రంపై అంత తేలిగ్గా దాడి చేశారంటే రక్షణ కల్పించడంలో వైఫల్యంగా చూడవలసి వుంటుంది.
ఈఘటనపై సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ట్విట్టర్లో వ్యాఖ్యానం చేస్తూ ఇదంతా గుజరాత్ మోడల్ అని ఎగతాళి చేశారు. అందరికీ అందుబాటులో వుండే తమ కార్యాలయానికి ఈ దాడితో బారికేడ్లు పెట్టాల్సి వచ్చిందని వ్యాఖ్యానించారు. దీంతో ట్విట్టర్లో ఆయనపైనా తీవ్ర వ్యాఖ్యలు గుప్పిస్తున్నారు. ఇలాటి అసహనం ఎవరికీ మంచిది కాదు.