వైసీపీ నేత మోకా భాస్కర్ రావు హత్య కేసులో ప్రమేయం ఉందంటూ… పోలీసులు అరెస్ట్ చేసిన మాజీ మంత్రి కొల్లు రవీంద్రకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆయనను జూలై నాలుగో తేదీన అరెస్ట్ చేశారు. విచారణలో పోలీసులు చురుకుగా లేకపోవడం… చార్జిషీటు ఇంకా దాఖలు చేయకపోవడంతో.. కొల్లు రవీంద్ర లాయర్లు కోర్టు నుంచి బెయిల్ సాధించగలిగినట్లుగా తెలుస్తోంది. బెయిల్ కోసం.. కొల్లు రవీంద్రకు మొత్తం 14 షరతులను కోర్టు పెట్టింది. 28 రోజుల పాటు విజయవాడలోనే ఉండాలని ఆదేశించింది.
మోకా భాస్కర్ రావు అనే నేత పేర్ని నానికి ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. ఆయనను కొంత మంది దుండగులు చేపల మార్కెట్లో పొడిచి చంపేశారు. నిందితుల కుటుంబసభ్యుడిని గతంలో హత్య చేసిన కేసుల్లో మోకా భాస్కర్ రావు నిందితుడిగా ఉన్నారు. నిందితులను అదే రోజు పట్టుకున్నట్లుగా పోలీసులు ప్రకటించారు.వారు పోలీస్ స్టేషన్లో ఉన్నట్లుగా ఫోటోలు కూడా వచ్చాయి. మీడియాలోనూ ప్రచురించారు. అయితే.. నిందితులు.. పరారీలో ఉన్నప్పుడు కొల్లు రవీంద్రకు ఫోన్ చేశారని.. హత్యలో ఆయన ప్రమేయం ఉందని చెప్పిన పోలీసులు అరెస్ట్ చూపించారు. రాజకీయ కుట్రతో కొల్లు రవీంద్రను అరెస్ట్ చేశారని టీడీపీ నేతలు మండిపడ్డారు.
మచిలీపట్నం ఎమ్మెల్యేగా ఉంటూ ఐదేళ్లు మంత్రిగా ఉన్న కొల్లు రవీంద్రకు సౌమ్యుడిగా పేరు ఉంది. ఐదేళ్ల కాలంలో మచిలీపట్నంలో చిన్న రాజకీయ ఘర్షణ కూడా జరగలేదు. కానీ ఆయన ప్రతిపక్షంలోకి వెళ్లిన తర్వాత రాజకీయ హత్య చేయించారని కేసు పెట్టడం సంచలనం అయింది. ఇప్పుడు ఆయనకు బెయిల్ వచ్చింది.