ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదాయం కోసం వినూత్న మార్గాలు అన్వేషిస్తోంది. అయితే అభివృద్ధి పనులు చేయడం ద్వారా.. పరిశ్రమలను ఆకర్షించడం ద్వారా.. ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని అనుకోవడం లేదు. ప్రజల నుంచి పన్నుల రూపంలో వసూలు చేసుకోవాలనే దాంట్లోనే క్రియేటివిటీ చూపిస్తోంది. తాజాగా అందిరికీ వృత్తిపన్ను విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో సినిమా ఇండస్ట్రీలోని అన్ని క్రాఫ్టుల నుంచి కర్రీ పాయింట్ల వరకూ ఉన్నాయి. అందరూ విధిగా వృత్తిపన్ను కట్టాలే చూడనున్నారు. ఇప్పటి వరకూ వృత్తి పన్ను రెండు శ్లాబులుగా ఉండేది. ఓ శ్లాబ్‌లో రూ. 1250గా వృత్తి పన్ను ఉంటుంది. దీన్ని ఏకంగా రూ. 2000కు పెంచేసింది ప్రభుత్వం. అంతటితో అయిపోదు.. ఏడాదికి రూ. 2500 మించకుండా వృత్తి పన్ను వసూలు చేయనుంది.
ఆంధ్రప్రదేశ్‌లో సినీ ఇండస్ట్రీ పెద్దగా లేదు. ఎవరైనా కళాకారులు ఉన్నా.. వారికి ఉపాధి లభించే అవకాశాలు అంతంతమాత్రమే. అయినప్పటికీ.. వారు ఖచ్చితంగా ఏడాదికి రూ. 2500 ప్రభుత్వానికి చెల్లించాల్సిందే. వీడియో లైబ్రరీ, వే బ్రిడ్జి ఆపరేటర్లకూ అంతే పన్ను ఖరారు చేశారు. ఇక ఎవరైనా రోడ్డు పక్కన కర్రీ పాయింట్లు పెట్టుకుని బతకాలని అనుకున్నా.. రూ. 2500 కట్టాల్సిందే. కొసమెరుపేమిటంటే.. ఈ జాబితాలో పబ్లిక్ టెలిఫోన్ ఆపరేటర్లకు వృత్తి పన్ను నుంచి మినహాయింపు ఇచ్చి ఔదార్యం చాటుకున్నారు. వాస్తవానికి ఇప్పుడు ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉంది. పబ్లిక్ టెలీఫోన్ అనే పదార్థమే కనిపించి చాలా కాలం అయింది. ఇప్పుడు వాటికి మినహాయింపు ఇచ్చి అన్నింటికీ పన్ను వడ్డించారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధి కరవై ప్రజలు వలస బాట పట్టాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలాంటి సమయంలో.. చిన్నా చితకా వ్యాపారాలు చేసుకునే వారిపైనా పన్ను బాదడం… ప్రోత్సాహం ఇవ్వాల్సిన సినీ పరిశ్రమ కార్మికులకు మరింతగా వడ్డించడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ప్రభుత్వానికి గణనీయంగా పడిపోయిన ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రజల వద్ద నుంచే వసూలు చేయాలన్న విధానాన్ని ప్రభుత్వం అమలు చేయడంతోనే సమస్య వస్తోంది. వేరే విధంగా ఆదాయమార్గాలను పెంచుకోవడంపై పెద్దగా శ్రద్ధ పెట్టకపోవడంతో ఆ భారం ప్రజలపైనే పడుతోంది.