ఇటీవల వైష్ఱవ్ తేజ్ తో ఓ సినిమా ని పట్టాలెక్కించాడు క్రిష్. `కొండపాలెం` అనే నవల ఈ చిత్రానికి ఆధారం. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రచించిన అవార్డు నవల ఇది. సాహితీ లోకంలో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. క్రిష్ స్వతహాగా సాహిత్యాభిమాని. తనకు ఈ నవల బాగా నచ్చడంతో.. రచయితని కలిసి.. హక్కుల్ని పొందాడు. క్రిష్ లాంటి దర్శకుడు అడిగితే… ఏ రచయిత అయినా… ఆనందంగానే హక్కుల్ని ఇస్తారు కూడా.
అయితే ఈ నవలకు క్రిష్ దాదాపు 15 లక్షలు చెల్లించినట్టు టాక్. ఇతర భాషల్లో రీమేక్ చేసే అవకాశం వస్తే, ఆ హక్కుల్లోనూ రచయితకు వాటా వెళ్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఓ నవలకు ఇంత రేటు రావడం మంచి విషయమే. కాకపోతే.. సినిమా కథలకు బాగా కరువొచ్చి పడింది. మంచి కథ దొరకాలంటే లక్షలు గుమ్మరించాల్సిందే. అలా చూస్తే… ఈ నవలను మంచి రేటుకే క్రిష్ దక్కించుకున్నట్టు. క్రిష్ ఎంతిచ్చాడు? ఆ నవల స్థాయి ఎంత? అనేది పక్కన పెడితే, తాజా ప్రయత్నంతో…. తెలుగులో పాపులర్ అయిన ఇతర నవలలకు మంచి రోజులు వచ్చినట్టే. ఈ ప్రయత్నం విజవంతమైతే… మరిన్ని నవలల్ని తెరపై చూసుకునే అవకాశం దక్కుతుంది.