స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం విషయంలో అనుమతులు ఇచ్చిన కలెక్టర్ , సబ్ కలెక్టర్, డీఎం అండ్ హెచ్వోలను ఎందుకు బాధ్యలుగా చేయలేదని… హైకోర్టు సూటిగా ప్రశ్నించింది. అగ్నిప్రమాదం విషయంలో తమపై అక్రమంగా కేసులు పెట్టారని..వాటన్నింటిని రద్దు చేయాలని కోరుతూ.. ఆస్పత్రి ఎండీ రమేష్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టులో… రమేష్ ఆస్పత్రినే పూర్తిగా లక్ష్యంగా చేసుకున్న తీరును … ఆస్పత్రి తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వాదనలు విన్న హైకోర్టు పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్పై స్టే విధించింది. ఈ కేసు విషయంలో తదుపరి చర్యలన్నింటినీ నిలిపివేయాలని స్పష్టం చేసింది. స్వర్ణా ప్యాలెస్‌ను గతంలో ఎయిర్పోర్ట్ క్వారంటైన్ సెంటర్‌గా నిర్వహించారా? లేదా? అని హైకోర్టు ప్రశ్నించింది.
స్వర్ణ ప్యాలెస్ లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనను పూర్తిగా రమేష్ ఆస్పత్రికి అన్వయించిన పోలీసులు డాక్టర్ రమేష్‌ను అరెస్ట్ చేయడానికి ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. అదే సమయంలో… వైసీపీ నేతలు.. డాక్టర్ రమేష్‌ను రమేష్ చౌదరి పేరుతో సంబోధిస్తూ విమర్శలు చేయడం ప్రారంభించారు. దీనిపై ఎవరైనా ట్వీట్లు చేస్తే.. పోలీసులు వారికీ కూడా నోటీసులు ఇస్తామంటూ హెచ్చరికలు చేయడం ప్రారంభించారు. ఇంకా విచిత్రంగా డాక్టర్ రమేష్ ఆచూకీ చెబితే రూ. లక్ష ఇస్తామని పోలీస్ కమిషనర్ ప్రకటించారు.
స్వర్ణ ప్యాలెస్ ఘటనతో సంబంధం లేని.. గుంటూరు రమేష్ ఆస్పత్రికి సంబంధించి రాయపాటి కుటుంబీకులైన మహిళా డాక్టర్లను కూడా పోలీసులు విచారించారు. ఈ పరిణామాలన్నీ కక్ష పూరితంగా సాగుతున్నాయన్న అభిప్రాయాలు బలంగా వినిపించాయి. అదే సమయంలో స్వర్ణా ప్యాలెస్‌లో కోవిడ్ సెంటర్ నిర్వహించడానికి అన్ని రకాల అనుమతులు ఇచ్చిన అధికారులను ఎందుకు ప్రశ్నించలేదనే చర్చ కూడా ప్రారంభమయింది. ప్రభుత్వం రకరకాల కమిటీలను విచారణకు నియమించింది. ఆ కమిటీలు కూడా.. అగ్నిప్రమాదం ఎలా జరిగిందన్న విషయం వదిలి పెట్టి రమేష్ ఆస్పత్రి తప్పొప్పులు చెప్పడానికే ప్రాధాన్యం ఇచ్చారు. ఇప్పుడు హైకోర్టు.. మొత్తంగా కేసు విచారణ జరుపుతున్న తీరునే ప్రశ్నించింది. ఎఫ్ఐఆర్పై స్టే విధించింది.