ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు పదవికి ప్రముఖ జర్నలిస్ట్ రామచంద్రమూర్తి రాజీనామా చేశారు. ముఖ్య సలహాదారు కల్లాం అజేయరెడ్డిని కలిసి రాజీనామా లేఖను ఇచ్చారు. నిజానికి రామచంద్రమూర్తి నాలుగైదు నెలల కిందటే రాజీనామా చేస్తారన్న ప్రచారం జరిగింది. కానీ అప్పట్లో సైలెంటయిపోయారు. ఇప్పుడు హఠాత్తుగా తన రాజీనామా లేఖను ఇచ్చారు. గతలో జగన్ మీడియాలో డైరక్టర్గా పని చేసిన ఆయన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏపీ ప్రభుత్వ పబ్లిక్ పాలసీ సలహాదారుగా జగన్ నియమించారు. కేబినెట్ హోదా ఇచ్చారు. నెలకు రూ.నాలుగు లక్షల వరకూ జీతభత్యాలు ఇస్తున్నారు. అయితే.. పని మాత్రం ఏమీ ఉండటం లేదు. ముఖ్యమంత్రి పాలనాపరమైన, విధాన నిర్ణయాలు తీసుకునే సమావేశాలకు ఆయనకు ఉండటం లేదు. కనీసం..చాంబర్ కూడా..కేటాయించలేదు.
ఎన్ని రోజులు ఎదురు చూసినా…తనను ఉత్సవ విగ్రహంగా అలా ఉంచారనే అసంతృప్తితో ఆయన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు. ఒక్క రామచంద్రమూర్తి మాత్రమే కాదు… ఏపీ ప్రభుత్వంలో సలహాదారులుగా నియమితులయ్యేవారిలో అత్యధికులు కేవలం ప్రజాధనం జీతంగా తీసుకోవడానికి మాత్రమే నియమితులవుతున్నారు. ఒక్క సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే అందరి సలహాలు తానే ఇస్తూంటారని చెబుతూంటారు. అలా ఉండటం ఇష్టం లేక రామచంద్రమూర్తి రాజీనామాకు సిద్ధపడ్డారు. ఈ సలహాదారులందర్నీ ప్రభుత్వం అప్పుడప్పుడూ వాడుకుటుంది. తమకు వ్యతిరేకంగా.. మీడియాలో కథనాలు వచ్చినప్పుడు… ఆయా రంగాలకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు.. ఈ సలహాదారులతో ప్రెస్మీట్లు పెట్టించడం.. ఎదురుదాడి చేయించడం వంటి వాటికి ఉపయోగించుకుంటూ ఉంటారు.
గతంలో మీడియాను అణిచివేసే జీవో విడుదల చేసినప్పుడు… మీడియాలో దశాబ్దాల అనుభవం ఉన్న రామచంద్రమూర్తి .. గతంలో ఇలాంటి చర్యల్ని ఖండించిన రామచంద్రమూర్తి కూడా… ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు పలుకుతూ… ప్రెస్మీట్ పెట్టాల్సి వచ్చింది. తాను ఇంత కాలం సంపాదిచుకున్న పేరు ప్రఖ్యాతుల్ని పణంగా పెట్టాల్సి వచ్చింది. అయినప్పటికీ.. ఆయనకు నిరాదరణే ఎదురయింది. చివరికి అవమానభారంతో పదవి నుంచి వైదొలిగారు.