ఆంధ్రప్రదేశ్ నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించి రెండు వారాలు దాటిపోయింది. ఆ విధానానికి ఏపీ కేబినెట్లో ఆమోదం తెలిపారు. బడుగు, బలహీనవర్గాలకు చెందిన వారికి ప్రోత్సహాకాలు తగ్గించడంపై టీడీపీ సహా పలు పార్టీల నేతలు మండిపడ్డారు. అయితే..ఎప్పట్లానే ప్రభుత్వం లైట్ తీసుకుంది. అయితే.. అనూహ్యంగా అందరూ మర్చిపోయిన సమయంలో… ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజు..ఈ అంశంపై స్పందించారు. ఏపీ నూతన పారిశ్రామిక విధానంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు తీవ్ర అన్యాయం జరిగిందని గొంతెత్తారు.
2015-20 పారిశ్రామిక విధానంలో వున్న రాయితీలను తీసేశారని.. సబ్సిడీ శాతాన్ని 45 శాతం నుండి 35 శాతానికి తగ్గించారని మండిపడ్డారు. గతంలో రూ.75 లక్షలు గరిష్టంగా ఉన్న సబ్సిడీ 50 లక్షలకు తగ్గించారని..నూతన పరిశ్రమలకు ప్రోత్సాహకాలు లేవు, కొత్తగా పరిశ్రమలు కూడా రావని మండిపడ్డారు. నిజానికి సోము వీర్రాజు చెప్పినవన్నీ నిజాలే. అవి మాత్రమే కాదు.. కేవలం.. అస్మదీయ పారిశ్రామికవేత్తలకు లబ్ది చేకూర్చేందుకు కూడా..కొన్ని విధానాలు పెట్టారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.
అయితే. .. అసలు పారిశ్రామిక విధానం ప్రవేశ పెట్టినప్పుడు సైలెంట్‌గా ఉంది..దాన్ని కేబినెట్లో కూడా ఆమోదించిన తర్వాత సోము వీర్రాజు… స్పందించడం ప్రారంభించారు. పదవిలోకి వచ్చినప్పటి నుండి ఆయన చేస్తున్న ప్రకటనలు.. బీజేపీ కి అధ్యక్షుడా.. వైసీపీకి అధికార ప్రతినిధా అన్నట్లుగా ఉన్నాయన్న విమర్శలు రావడంతో.. మొక్కుబడిగా ప్రభుత్వం తీరుపై కొన్ని విమర్శలు చేయడానికి… అరిగిపోయి.. ఆరిపోయిన సబ్జెక్ట్‌లను ఎంచుకుంటున్నారన్న చర్చ రాజకీయవర్గాల్లో ప్రారంభమయింది.