ఆంధ్రప్రదేశ్లో పోలీసు శాఖ పనితీరుపై వరుసగా వస్తున్న విమర్శలు.. దళితులపై దాడులు, అధికార పార్టీ నేతల కోసం.. డిపార్టుమెంట్ వారిని బలి చేస్తున్నారనే ఆరోపణలు విపరీతంగా వస్తూండటంతో.. డీజీపీ గౌతం సవాంగ్ స్పందించారు. ఒకరిద్దరు చేసిన పనులకు పోలీసు వ్యవస్థ మొత్తానికి చెడ్డ పేరు తీసుకు వస్తోందని.. పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారనే భావన వచ్చిందనన్నారు. అనుకోని సంఘటనలు కూడా పోలీసులకి సమస్యలు తెచ్చి పెడుతున్నాయని చెప్పుకొచ్చారు. మార్పు రావాలంటే ఖచ్చితంగా, కఠినంగా ఉండక తప్పదని హెచ్చరించారు. పోలీసులు తప్పు చేస్తే.. న్యాయపరంగానే కాదు..శాఖా పరంగా కూడా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.
వరుసగా పోలీసుల తీరు వివాదాస్పదమవుతూండటంతో.. వచ్చే మూడు నెలలు పోలీసులకు శిక్షణ ఇస్తామంటూ డీజీపీ సవాంగ్ ప్రకటించారు. మార్పు తేవటం పెద్ద కష్టం కాదనన్నారు. పలువురు పోలీసులు ఇసుక, మద్యం రవాణా వంటి అంశాల్లో పోలీసు సిబ్బంది టెంప్ట్ అవుతున్నారని… తొందరపడి కేసుల్లో ఇరుక్కుంటున్నారని గౌతం సవాంగ్ వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు ఇసుక, మద్యం కేసుల్లో 53 మంది పోలీసు సిబ్బంది పై కేసులు నమోదు చేశామని… పోలీసుల పైనే కేసులు పెట్టటం బాధగా ఉన్నా, తప్పలేదని చెప్పుకొచ్చారు. ఇలాంటి వాటికి పోలీసులు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.
దళితులపై జరుగుతున్న దాడుల విషయంపై.. ముఖ్యమంత్రి జగన్ కూడా.. మంగళవారం జరిపిన సమీక్షలో ప్రస్తావించారు. మన పోలీసులపై చర్యలు తీసుకోవడం బాధనిపించినా తప్పడం లేదని చెప్పుకొచ్చారు. అచ్చంగా అలాగే డీజీపీ కూడా… తప్పని సరిగా పోలీసులపై చర్యలు తీసుకుంటున్నామన్నట్లుగా చెప్పుకొచ్చారు. అయితే.. అధికార పార్టీ మెప్పు కోసం.. కట్టు తప్పుతున్న పోలీసుల వల్లే చెడ్డ పేరు వస్తుందనేది బహిరంగ రహస్యం. ఈ విషయంలో చర్యలు తీసుకోకపోతే.. ఈ ఘటనలు ఇలా జరుగుతూనే ఉంటాయి కానీ తగ్గవన్నది నిపుణుల అభిప్రాయం.