ఆంధ్రప్రదేశ్‌లో బల్క్ డ్రగ్ పార్క్‌ను ఏర్పాటు చేయడానికి ఏపీ ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలూ ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మూడు బల్క్ డ్రగ్ పార్క్‌లను ఏర్పాటు చేయాలనుకుంది. దానికి సంబంధించిన విధివిధానాలు.. ఆంధ్రప్రదేశ్‌కు అనుకూలంగా ఉన్నాయి. అయితే.. ఇతర రాష్ట్రాలు భారీ ఎత్తున ఆ బల్క్ డ్రగ్ పార్క్ కోసం… ప్రయత్నాలు చేస్తున్నాయి. ఏపీ ఇప్పటి వరకూ ఎలాంటి ప్రయత్నాలు చేయకపోడంపై విమర్శలు వచ్చాయి. దీంతో ప్రభుత్వం… ఈ బల్క్ డ్రగ్ పార్క్‌ను సాధించి తీరాలన్న పట్టుదలతో ప్రత్యేక దృష్టి పెట్టింది. ఏపీఐఐసీకి బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ప్రత్యేకంగా ఉత్తర్వులు ఇచ్చింది.
నిజానికి ఏపీఐఐసీ పనే.. పరిశ్రమల్ని ఆకర్షించడం. దీని కోసం ప్రత్యేకంగా ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేదు. అయితే.. తాము కూడా గట్టిగా ప్రయత్నిస్తున్నామని చెప్పుకోవడానికి ఈ ఉత్తర్వులు ఉపయోగపడతాయి. బల్క్ డ్రగ్ పార్క్ ను రాబట్టేలా చేసేందుకు ప్రత్యేకంగా ఏపీ బల్క్ డ్రగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పోరేషన్ ను కూడా ఏర్పాటు చేసేశారు. ఏపీఐఐసీ అనుబంధ సంస్థగా ఈ కార్పొరేషన్ ఉంటుంది. కేంద్రం నిబంధనల ప్రకారం.. కనీసం రెండు వేల ఎకరాలు ఈ పార్క్ కోసం కేటాయించాల్సి ఉంది.
ఏపీ బల్క్ డ్రగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పోరేషన్ నిరంతరం కేంద్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతుంది. దేశంలో మూడు మెగాపార్కుల ఏర్పాటు నేపథ్యంలో రాష్ట్రాల మధ్య పోటీ ఉండే అవకాశమున్నందున సమగ్రమైన ప్రాజెక్టు నివేదిక రూపకల్పనకు ఐఐసీటీ-సీఎస్ఐఆర్ సంస్థకు ప్రభుత్వం బాధ్యతలు ఇచ్చింది. ఒక వేళ ఏపీకి మెగా బల్క్ డ్రగ్ పార్కు కేటాయిస్తే.. కేంద్రం నుంచి వెయ్యికోట్ల వరకూ నిధులు అందే అవకాశం ఉంది.