పిల్లికి ఎలుక సాక్ష్యమన్నట్లుగా దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్‌లో లేడంటూ..ఇండియన్ మీడియాకు.. చోటా డాన్ చోటా షకీల్ .. ఫోన్ ఇన్ ఇంటర్యూలు ఇవ్వడం కలకలం రేపుతంది. వారం కిందట పాకిస్తాన్ నిషేధిత ఉగ్ర సంస్థలు, దాని అధినేతలపై ఆంక్షలు విధించింది. ఈ జాబితాలో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పేరు కూడా ఉంది. ఆయన కరాచీలో ఉంటున్న చిరునామాలను కూడా ప్రకటించింది. అయితే.. మళ్లీ ఎలాంటి హెచ్చరికలు వచ్చాయో కానీ… పాక్ ప్రభుత్వం మాట మార్చింది. దావూద్ తమ దేశంలో లేడని చెప్పుకొస్తోంది.
పాక్ ప్రభుత్వం ప్రకటించిన అడ్రెస్‌లలో ఎరవైనా లాడెన్ తరహాలో ఆపరేషన్ చేస్తారేమోనని భయపడ్డారేమో కానీ.. దావూద్‌కు ప్రియ శిష్యుడు చోటా షకీల్ భారత మీడియాకు ఫోన్ ఇంటర్యూలు ఇచ్చారు. కరాచీలో దావూద్ ఉన్నట్టు నిరూపించాలని ఆయన సవాల్ విసిరారు. పాక్‌లో లేకపోతే ఇమ్రాన్ ప్రభుత్వం ఎందుకలా చెప్పింది… ఉన్నాడన్న మాటను లేడు అని వెంటనే ఎందుకు మార్చేసిందన్నది చాలా మందికి అర్థం కాని విషయం. పాకిస్తాన్ ఇప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. ఏదో ఓ దేశం సాయం చేస్తే తప్ప గట్టెక్కలేని పరిస్థితి. పాకిస్తాన్ ఆర్థిక సాయం పొందాలంటే.. ఉగ్రవాదులపై కఠినంగా ఉండాలి.
ఉగ్రవాదులకు నిధులు, సహకారంపై నిఘా ఉంచే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్‌ఫోర్స్ గ్రే లిస్ట్ లో పాకిస్థాన్ ఉంది. గత రెండేళ్లుగా గ్రే లిస్ట్‌లో కొనసాగుతోన్న పాక్.. దాని నుంచి తప్పించుకునేందుకు 88 నిషేధిత ఉగ్రసంస్థలు, దాని అధినేతలపై ఆంక్షలు విధించింది. ఇందులో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్, జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజహర్, జకీర్ రెహమాన్ లఖ్వీ తదితరుల పేర్లు కూడా ఉన్నాయి. దావూద్ పేరునూ ప్రకటించింది. కానీ ఇప్పుడు ఆర్మీ నుంచి హెచ్చరికలు వచ్చాయేమో కానీ.. దావూద్ అక్కడ లేడని చెబుతోంది.