ఓ తెలుగు నటుడు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఆ కేసు విచారణ డ్రగ్స్ వద్దకు చేరింది. ఓ నటుడు ఇంట్లో సోదాలు జరిగాయి. ఆ కేసు కూడా డ్రగ్స్ వద్దకు చేరుతుంది. ఇప్పుడు బాలీవుడ్లో ఓ హీరో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ కేసు కూడా.. డ్రగ్స్ వద్దకే వెళ్తోంది. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసు విచారణలో ఇప్పుడు డ్రగ్స్ ఎపిసోడ్ నడుస్తోంది. సుశాంత్ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న రియా చక్రవర్తి డ్రగ్ పెడలర్గా గుర్తించినట్లుగా బయటకు చెప్పేశారు. ఆమెపై నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో కూడా కేసు పెట్టేసింది. ఇంకేముంది.. ఇక అంతా డ్రగ్స్ పై చర్చోపచర్చలే.
ఇప్పటి వరకూ సుశాంత్ ఆత్మహత్య ఘటనపై రియా ప్రధాన నిందితురాలిగా ఉన్నారు. ఇప్పుడు డ్రగ్స్ కేసులోనూ ఆమే ప్రధాన నిందితురాలు. డ్రగ్స్ వ్యాపారులతో ఆమెకు సంబంధం ఉందని.. ఆధారాలు దొరికాయని ఓ వాట్సాప్ చాట్ కూడా.. వెలుగులోకి వచ్చింది. ఏ మోతాదులో డ్రగ్ తీసుకోవాలో రియా సూచిస్తున్న వాట్సాప్ చాట్ అది. అయితే రియా లాయర్ మాత్రం.. ఎప్పుడైనా బ్లడ్ టెస్టుకు రెడీ అని.. డ్రగ్స్‌తో సంబంధం లేదని ప్రకటన జారీ చేశారు.
కొసమెరుపేమిటంటే.. సుశాంత్ కేసులో ఏ చిన్న డెలవప్మెంట్ జరిగినా తెరపైకి వచ్చేస్తున్న కంగనా రనౌత్.. ఈ సారి సుషాంత్ మృతికి కారణం… డ్రగ్స్ సీక్రెట్స్ తెలియడమేనని.. ప్రకటన చేసేశారు. సుశాంత్‌సింగ్‌కు “డర్టీ సీక్రెట్స్” తెలుసు కాబట్టే అతను చనిపోవాల్సి వచ్చిందని.. బాలీవుడ్లో డ్రగ్స్ అన్నవి సర్వసాధారణమని ఎక్కువ కోకైనా వాడతారని ప్రకటించేసింది. ఇండస్ట్రీలో వాళ్లే ఆజ్యం పోస్తూంటే.. ఇక మీడియా ఊరుకుంటుందా..?
సినిమా వాళ్ల విషయాలు ఆసక్తికరంగా ఉంటాయని.. ఎక్కువ మంది వింటారని.. చూస్తారని.. వారి విషయాలను చెప్పడానికి మీడియా అమితాసక్తి ప్రదర్శిస్తుంది. కానీ..అందులో నిజానిజాలేంటో ఎవరూ అంచనా వేయలేరు. నిజాలు నిరూపించలేరు కూడా. అందుకే ఇంత వరకు..దేశంలో ఎన్నో సార్లు సినీ సెలబ్రిటీలు.. డ్రగ్స్ కేసుల కాంబో బయటకు వచ్చింది. కానీ ఒక్కంటే.. ఒక్క సారి కూడా ఎవరికీ శిక్ష పడలేదు. ప్రస్తుతం సుషాంత్ కేసులోనూ అదే పరిస్థితి. చాలా మంది ప్రముఖుల ఆనవాళ్లతో ప్రచారాన్ని ప్రారంభించేశారు. చివరికి ఎవరికీ శిక్ష పడదు..! ఎవరూ దొరకరు..!