`ఆచార్య` కథ నాదేం అంటూ… రాజేష్ మండూరి అనే రచయిత ఇప్పుడు రచ్చ మొదలెట్టాడు. ఆ కథ పట్టుకుని తాను ఎవరెవరిని కలిసిందీ? వాళ్లేం చెప్పిందీ.. పూస గుచ్చినట్టు, డేట్లతో సహా వివరిస్తున్నాడు. ఈ మొత్తం వ్యవహారంలో కొరటాల శివనీ ఇన్వాల్వ్ చేస్తున్నాడు. `మన ఇద్దరి కథ ఒకేలా వుంది` అంటూ కొరటాల కూడా తనతో అన్నట్టు… వాదన బలంగానే వినిపిస్తున్నాడు.
అయితే కొరటాల శివ లాంటి దర్శకుడు కాపీ కొడతాడా? అలాంటి కథల్ని ఎంకరేజ్ చేస్తాడా? అన్నది అనుమానమే. ఎందుకంటే… కొరటాల దగ్గర కథలకు కొరత లేదు. తన దగ్గర దాదాపు 10 కథలు బౌండెడ్ స్క్కిప్టుతో సహా రెడీగా ఉన్నాయి. పైగా కొరటాల భావాలు, తన ఆదర్శాలూ, ఇతర రచయితలకు ఇచ్చే విలువ ఇవన్నీ తెలిసిన వాళ్లు `అసలు కొరటాల అలాంటి పని చేయడు` అంటూ నమ్మకంగా చెబుతున్నారు. రచయితగా ఒక్కో మెట్టూ ఎక్కి పైకి వచ్చినవాడు కొరటాల శివ. తాను రచయితగా ఉన్నప్పుడు దర్శకులు తనని ఎలా వాడుకున్నదీ, క్రెడిట్స్ ఇవ్వకుండా ఎలా తొక్కేసిందీ.. తనకు బాగా తెలుసు. చాలా ఇంటర్వ్యూలలో తనే ఈ విషయాన్ని ఏకరువు పెట్టుకున్నాడు. అలాంటి కొరటాల మరొకరి.. కథని కాపీ కొట్టాడంటే నమ్మలేం. `ఆచార్య` సినిమాని నిజంగా మైత్రీ మూవీస్ సంస్థే నిర్మిస్తుంటే అప్పుడు అనుమానించాల్సివచ్చేదేమో. మైత్రీ చెప్పిన ఓ పాయింట్ ఆధారంగా కొరటాల ఈ కథను అల్లుకున్నాడేమో అనుకోవొచ్చేమో. కానీ ఇక్కడ ఆ పరిస్థితి కూడా లేదు. ఒకరికి వచ్చిన ఆలోచన మరొకరికి రావడంలో ఎలాంటి వింతా, విడ్డూరం లేదు. కొరటాల తన కథని ఎప్పుడు రిజిస్టర్ చేయించాడు? రాజేష్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు అయ్యింది? అనేది ఆరా తీస్తే.. అసలు విషయం అర్థమవుతుంది. అసలు రెండు స్క్రిప్టులూ పక్క పక్కన పెట్టి బేరీజు వేస్తే… ఈ విషయం కొంత వరకూ కొలిక్కి రావొచ్చు. అయినా.. కాపీ విషయాన్ని నిరూపించుకోవడం అంత తేలికేం కాదు. కాపీ రైట్స్ లో ఉన్న లొసుగులు చాలామందికి బలంగా మారుతున్నాయి కూడా. `కత్తి` (తెలుగులో ఖైదీ నెం.150గా వచ్చింది) కథపై కూడా ఇలాంటి పంచాయితీ జరిగింది. రచయిత తన కథ పట్టుకుని, కాళ్లు అరిగేలా తిరిగాడు. కానీ… న్యాయం జరగలేదు. ఈసారి ఏం అవుతుందో?