నిన్న రాత్రి ముంబైలో గిర్ గావ్-చౌపాతీ బీచ్ వద్ద మేక్ ఇన్ ఇండియా సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నపుడు భారీ అగ్నిప్రమాదం జరిగింది. సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్న వేదిక క్రింద మంటలు చెలరేగడంతో క్షణాలలో వేదిక పూర్తిగా దగ్ధమయిపోయింది. దానికి కొన్ని నిమిషాల ముందే బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ అదే వేదికపై చిన్న కవితను వినిపించారు. ఆ తరువాత 8.22 నిమిషాలకు బాలీవుడ్ నటి పూజా సావంత్ బృందం లావణి నృత్య కార్యక్రమం చేస్తుండగా వేదిక క్రింద మంటలు అంటుకొన్నాయి. అది గమనించిన సభ నిర్వాహకులు వారిని తక్షణమే వేదిక మీద నుండి క్రిందకు దింపివేశారు. వారు వేదిక దిగిన కొన్ని క్షణాలలోనే మంటలలో వేదిక మొత్తం తగులబడిపోయింది.
దగ్గరలోనే ఉన్న అగ్నిమాపక బృందాలు వెంటనే అక్కడికి చేరుకొని మంటలను ఆర్పివేశారు. ఈ అగ్ని ప్రమాదానికి కారణం ఇంకా తెలియదు. సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్న వేదిక క్రింద అమర్చిన విద్యుత్ వైర్లు షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు చెలరేగి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ కార్యక్రమాలు చౌపాతీ బీచ్ ఒడ్డున నిర్వహిస్తుండటంతో అక్కడ వీస్తున్న బలమయిన గాలికి మంటలు చాలా వేగంగా వేదికపైకి వ్యాపించాయి.
ఆ కార్యక్రమంలో పాల్గొనేందుకు మహారాష్ట్ర గవర్నర్ సి.హెచ్. విద్యాసాగర రావు, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, రాష్ట్ర మంత్రులు, శివసేన అధినేత ఉద్దవ్ టాక్రే, అనేకమంది బాలీవుడ్ ప్రముఖులు, 60 దేశాల నుండి ప్రతినిధులు, సుమారు 10,000కి పైగా ప్రజలు వచ్చేరు. మంటలు అంటుకోగానే అప్రమత్తమయిన పోలీసులు లోపల ఉన్నవారిని అందరినీ జాగ్రత్తగా బయటకి తరలించారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్వయంగా వారిని బయటకు తరలించడంలో సహాయపడ్డారు. ఆ సభా వేదికకి ఐదు ద్వారాలు ఏర్పాటు చేసి ఉండటంతో అందరినీ వేగంగా బయటకి తరలించడం సాధ్యమయింది. ఇంత భారీ అగ్నిప్రమాదంలో ఏ ఒక్కరు కూడా గాయపడకుండా తప్పించుకోగలిగారు.