చిరంజీవి కెరీర్లో… మరో సూపర్ డూపర్ హిట్ సినిమా… `చూడాలనివుంది`. అప్పట్లో ఆల్ టైమ్ ఇండ్రస్ట్రీ రికార్డుల్ని సృష్టించింది. సరిగ్గా.. ఈనాటికి ఈ సినిమా విడుదలై 22 ఏళ్లు. నిజానికి అసలు ఈ సినిమా సెట్ అవ్వడమే ఓ మ్యాజిక్. ఇలాంటి చాలా మ్యాజిక్కులు.. `చూడాలనివుంది`తో సాధ్యం అయ్యాయి. అవన్నీ ఓసారి గుర్తు చేసుకుంటే..
సొగసు చూడతరమా, బాల రామాయణంలాంటి సినిమాలతో అప్పుడప్పుడే గుర్తింపు తెచ్చుకుంటున్నాడు గుణ శేఖర్. మరోవైపు చిరు అంటే మాస్ ఇమేజ్. చిరుకి తగిన కథ గుణ తీసుకురాగలడా? అసలు ఇద్దరి కాంబో సెట్ అవుతుందా? అనే అనుమానాల మధ్య ఈ సినిమా మొదలైంది. నిజానికి… `బాలరామాయణం` చూశాక… గుణ శేఖర్‌పై ఓ ఇంప్రెషన్ కలిగింది చిరుకి. `గుణ దగ్గర ఓ కథ ఉంందట.. వింటారా?` అంటూ చూచాయిగా ఓ నిర్మాత చిరు చెవిన కబురు వేస్తే… `రమ్మనండి.. వింటా` అన్నారు.
చిరు – గుణశేఖర్ కలుసుకోవడం అదే తొలిసారి. తొలి మీటింగులోనే… గుణ చెప్పిన కథని ఓకే చేసేశాడు చిరు. దాంతో.. ఏమాత్రం ఊహించని కాంబో సెట్టయ్యింది. కొలకొత్తా నేపథ్యంలో సాగే కథ ఇది. సినిమా మొత్తం కొలకొత్తా బ్యాక్ డ్రాప్ లో సాగడం.. తెలుగు సినిమాకి సంబంధించినంత వరకూ అదే తొలిసారి. కొలకొత్తాలో కొన్ని సీన్లు తెరకెక్కించినా, అపార్ట్మెంట్ సెట్ మాత్రం హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలోనే వేశారు. అప్పట్లో అత్యంత ఖరీదైన సెట్ అదే.
సంగీత పరంగా ఈ సినిమా ఆడియో కొత్త పుంతలు తొక్కింది. `రామ్మా చిలకమ్మా` పాటైతే… మార్మోగిపోయింది. ఈ పాటను ఉదిత్ నారాయణ్ తో పాడించారు. చిరుకి ఉదిత్ గొంతు సెట్ అవ్వదన్నది అందరి నమ్మకం. భయం. కానీ.. చిరు మాత్రం లెక్క చేయలేదు. `ఉదిత్ గొంతులో ఇలాంటి పాట కొత్తగా ఉంటుంది` అని నమ్మారు. ఫలితం తెలిసిందే. ఆ పాట తరవాత.. ఉదిత్ తెలుగులో బిజీ సింగర్ అయిపోయాడు.
`యమహా నగరి.. కలకత్తా పురి` ఓ క్లాసికల్ సాంగ్. ఇలాంటి పాట చిరు సినిమాలో ఊహించడం కష్టం. పైగా ఇంట్రడక్షన్ పాటలా. ఈ పాటపై కూడా తర్జనభర్జనలు జరిగాయి. కానీ.. చివరికి అదే ఫైనల్ అయ్యింది. కొలకొత్తా రాష్ట్ర గీతంగా వాడుకోదగిన పాట.. అన్న స్థాయిలో వేటూరి ఈ పాట అద్భుతంగా రాశారు. దాన్ని మణిశర్మ స్వరపరిచిన విధానం, హరిహరన్ పాడిన పద్ధతి.. ఈ పాటని ఎక్కడికో తీసుకెళ్లిపోయింది.
టైటిల్ కూడా ఓ మ్యాజిక్కే. చూడాలనివుంది.. అన్నది క్లాస్ టైటిల్. చిరులాంటి మాస్ హీరో సినిమాకి ఇదేం టైటిల్ అని.. ముందు పెదవి విరిచారు. కానీ.. సినిమా విడుదలయ్యాక.. ఈ టైటిల్ ప్లస్ అయ్యింది. ఫ్యామిలీ ఆడియన్స్‌ని మరింత చేరువ చేసింది. ఈ సినిమాతో ప్రకాష్ రాజ్ ప్రధాన విలన్ గా మారిపోయాడు.
ఈ సినిమాకి ముందు టబు – చిరు కాంబోలో ఓ సినిమా మొదలై, మధ్యలో ఆగిపోయింది. ఆ సినిమా కోసం తెరకెక్కించిన ఓ గీతాన్ని `చూడాలనివుంది` విడుదలై 50 రోజులు పూర్తయిన తరవాత కలిపారు. దాంతో.. రిపీట్ ఆడియన్స్ తో థియేటర్లు మళ్లీ కిటకిటలాడిపోయాయి.