” చెడిపోయిన రాజకీయ వ్యవస్థను బాగు చేయాలంటే మీ అందరి సహకారం కావాలి.. ఏదైనా హామీ నెరవేర్చకపోతే తక్షణం రాజీనామా చేసి వెళ్లిపోయే వ్యవస్థను తీసుకొస్తాను..”.. ఇది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట. కాకపోతే.. ఎన్నికల ప్రచారంలో బాగా చెప్పారు…!
“ముఖ్యమంత్రే చట్టాలను ఉల్లంఘిస్తే ఇక ప్రజాస్వామ్యానికి ఎవరు రక్ష.. అందుకే చట్టాలను ఉల్లంఘించి కట్టిన ప్రజా వేదికను… ఈ రోజు నుంచే కూలగొట్టేస్తున్నాం..” ఇదీ జగన్ మాటే.. కాకపోతే.. ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి మీటింగ్.
” కులం, మతం చూడం.. అందరికీ పథకాలు ఇస్తాం..” ఇది సమీక్షల్లో సీఎం జగన్ చెప్పే మాట..!
” రాజ్యాంగం, చట్టం ప్రకారం నడుచుకుంటేనే అభివృద్ధి..” ఇది కూడా ముఖ్యమంత్రి జగన్ మాటే. కాకపోతే.. సీఎంగా పధ్నాలుగు నెలల అనుభవం తర్వాత చెప్పిన మాటలు. ఈ మాటల్లో ఎక్కడా డబుల్ మీనింగ్ లేదు. జగన్మోహన్ రెడ్డి.. తన అభిప్రాయాలను.. తాను నిక్కచ్చిగా చెప్పారు. ఇలాంటి ఆదర్శాలు ఎన్నెన్నో చెబుతూంటారు కూడా. కానీ.. ఆయన చెబుతున్నదానికి .. చేస్తున్న దానికి పొంతన కనిపించకపోవడమే.. ప్రస్తుతం ఆంధ్ర ప్రజలను నిబిడాశ్చర్యానికి గురి చేస్తున్న అంశం.
అమరావతి విషయంలో మాట తప్పారుగా…చెడిపోయిన రాజకీయ వ్యవస్థను బాగు చేయరా..?
మాట తప్పితే.. హామీలు నెరవేర్చలేకపోతే… రాజీనామా చేసే పరిస్థితి రావాలని.. అప్పుడే రాజకీయ వ్యవస్థ మారుతుందని జగన్ చెబుతూ ఉంటారు. ఇదే విషయాన్ని ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఊరూవాడా చెప్పారు. ఆయన ఆదర్శం చాలా మందికి నచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా చెబుతున్నారు. చెడిపోయిన రాజకీయ వ్యవస్థను బాగు చేస్తానని చెబుతున్నారు. మరి మార్చేసిన మాటల గురించి మాత్రం చెప్పడం లేదు. అమరావతినే రాజధానిగా ఉంటుందని చెప్పి.. అధికారంలోకి వచ్చాక మూడు ముక్కలు ఎందుకు చేస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నా.. తన మార్క్ రాజకీయ వ్యవస్థను బాగు చేయాలనే ఆలోచన చేయడం లేదు. కనీసం.. ప్రజలకు సమాధానం చెప్పాలన్న ఆలోచన కూడా ఆయన చేయడం లేదు. 33వేల ఎకరాలు ఇచ్చిన 29వేల మంది చిన్న, సన్నకారు రైతులను.. పోలీసులతో కొట్టించి.. కేసులు పెట్టించి… దమనకాండ సాగించారు కానీ.. తన ఆదర్శం మాత్రం గుర్తుకు తెచ్చుకోలేకపోయారు. అప్పట్లో అలా అన్నారు కదా.. అని అందరూ గుర్తు చేస్తున్నా… సీఎం గుర్తు చేసుకోవడం లేదు. ఇంత దారుణంగా ప్రజల్ని వంచిస్తున్నారని విపక్ష పార్టీలు మండి పడుతున్నా.. దులిపేసుకుంటున్నారు. మళ్లీ ప్రజాభిప్రాయం తీసుకుని ఏం చేసుకున్నా.. తమకు అభ్యంతరం లేదని… అంటున్నా.. జగన్ పట్టించుకోవడం లేదు. మాట తప్పి.. ఇచ్చిన హామీలను పట్టించుకోకుండా.. రాజకీయ వ్యవస్థను బాగు చేసే అవకాశం వచ్చినా జగన్ ఉపయోగించుకోలేకపోతున్నారు. ఒక్క అమరావతి విషయంలోనే కాదు.. అగ్రిగోల్డ్ బాధితులకు ఇస్తామన్న రూ. 1150 కోట్ల నుంచి సీసీఎస్ రద్దు వరకూ.. అనేకానేక హామీలు అలా ఉండిపోయాయి. చివరికి ఉద్యోగాల క్యాలెండ్ కూడా దిక్కులేదు. వీటన్నింటికీ ఏం చెబుతారో మాత్రం తెలియదు.. కానీ ఆయన మొదట్లో చెప్పిన ఆదర్శం మాత్రం అమలు చేయడం లేదు. చేయరు కూడా.. అంటే.. చెడిపోయిన రాజకీయ వ్యవస్థను మార్చడానికి ఆయన సిద్ధంగా లేరని అనుకోవాలి.
నిజమే.. ముఖ్యమంత్రే చట్టాలను ఉల్లంఘిస్తే ఎవరికి చెప్పుకోవాలి..!?
ప్రజాస్వామ్యంలో ముఖ్యమంత్రే సూపర్ పవర్. గవర్నర్ పేరు మీద వ్యవహారాలు నడిచినా.. ఆయనే కింగ్. అందులో సందేహం లేదు. ఆ కింగుతనం… పూర్తిగా ప్రజల కోణంలోనే ఉంటుంది. తనను తాను మహారాజుగా భావించుకుని… తనకు.. తన వర్గానికి… మేలు చేసుకుంటూ… గడిపేయడానికి కాదు ఆ పదవి వచ్చింది. ఏ రాజ్యాంగం ప్రకారం ముఖ్యమంత్రి అయ్యారో.. ఆ రాజ్యాంగాన్ని గౌరవించాల్సిన బాధ్యత ఉంటుంది. ఇష్టం లేని రాజకీయ నేతల వ్యాపారాలను దెబ్బకొట్టడానికి తమ పార్టీలో చేరకపోతే.. జైళ్లకు పంపడానికి కాదు.. ఆ అధికారాన్ని ఉపయోగించాల్సింది. చట్టాలను తమ వారికి కాకుండా.. ఇష్టం లేని వారందరికీ… అతిగా… అమలు చేయమని… తమకు వ్యతిరేకంగా విమర్శ చేస్తే జైలుకు పంపేలా చట్టం అమలు చేసి.. తమకు ఇష్టం లేని వ్యక్తుల్ని నడి రోడ్డుపై నరికేసినా… స్టేషన్ బెయిలిచ్చేలా… చట్టాన్ని చుట్టంగా చేసుకోమని కాదు.. రాజ్యాంగం చెప్పేది. ముఖ్యమంత్రి అనే వ్యక్తి.. తండ్రి లాంటి వాడు. ఈ విషయాన్ని సీఎం జగనే తరచూ చెబుతూంటారు. అలాంటప్పుడు.. చట్టం.. న్యాయం అందరికీ సమానంగా వర్తింప చేయాలి. చట్టాలను తాను స్వయంగా పాటించాలి. కానీ.. ఎక్కడా అలాంటి పరిస్థితే కనిపించదు.. చివరికి… అందరికీ చెప్పే మాస్క్ విషయంలోనూ అదే పద్ధతి.
కులం, మతం చూడరు.. అన్నీ రెడ్లకే ఇస్తారా..?
బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి ఎవరూ.. కులం పేరు ఎత్తరు. కానీ జగన్మోహన్ రెడ్డి.. ఓ కులంపై ద్వేషంతో రగిలిపోతూంటారు. ఆ విషయాన్ని ఆయనే పలుమార్లు తన మాటల ద్వారా వెల్లడించారు. అంత కుల ద్వేషం ఆయనకు ఎలా వచ్చిందో.. ఎందుకు వచ్చిందో కానీ.. ముఖ్యమంత్రిగా మాత్రం.. ఆయన అన్ని కులాలను సమానంగా చూడాల్సి ఉంటుంది. ముఖ్యమంత్రి అయిన మొదట్లో… కులం చూడం.. మతం చూడం..పార్టీలు చూడం అందరికీ సంక్షేమ పథకాలు ఇస్తామని ప్రకటించారు. ఇప్పుడు ఊరూవాడా వాలంటీర్లు… వైసీపీ సానుభూతిపరులు.. కార్యకర్తలు అనుకున్న వారికి మాత్రమే.. పథకాలు వర్తింప చేస్తున్నారు. ప్రజా సాధికార సర్వే లాంటి ప్రామాణికత ఉన్న జాబితాలను పక్కన పెట్టేసి.. వాలంటీర్లు ఇచ్చిన జాబితాలకే పథకాలు అమలు చేస్తున్నారు. ఇప్పుడు ఊరూవాడా… వైసీపీ నాయకుల్ని ప్రసన్నం చేసుకుని తాము మీ పార్టీనే అని చెబితే తప్ప.. నూకలు దొరికే పరిస్థితి లేకుండా పోయింది. సీఎం స్వయంగా పథకాల అమలులో కులాల్ని తెచ్చారు. రైతు భరోసా పథకంలో అగ్రవర్ణాల రైతులకు ప్రయోజనం కల్పించలేదు. అక్కడే కులం, మతం చూడమన్న ఆయన మాట తేలిపోయింది. ఆ తర్వాత నామినేటెడ్ పదవుల్లో బడుగులు.. బలహీనవర్గాలకు రిజర్వేషన్లు అని చట్టం చేశారు కానీ… ఎక్కడైనా అమలు చేశారో లేదో ఎవరికీ తెలియదు. రఘురామకృష్ణరాజు చెప్పినట్లు.. ఏపీ పదవి ఖాళీ అయిన రెడ్డి వచ్చి చేరుతున్నారు. ప్రతి రెండు రోజులకు ఓ రెడ్డికి పదవి ఇస్తున్నారు. రాష్ట్రంలో మరే కులాలు లేనట్లుగా… రెడ్డియిజం ఎందుకు ఏర్పడుతుందో.. జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చెప్పాల్సిన సమయం దగ్గర పడింది.
రాజ్యాంగం, చట్టం ప్రకారమే నడుచుకుంటున్నారా..?
” రాజ్యాంగం, చట్టం ప్రకారం నడుచుకుంటేనే అభివృద్ధి..” ఆని ఆగస్టు పదిహేను సందర్భంగా ప్రసంగంలో జగన్మోహన్ రెడ్డి… నొక్కి చెప్పారు. ఆ మాటలు ఎంతో హాయిగా అనిపిస్తాయి. కానీ.. జగన్మోహన్ రెడ్డి వాటిని పాటిస్తున్నారా.. అన్నదే సందేహం. ఎందుకంటే.. ఒక్కటంటే.. ఒక్క ఏడాదిలో సీఎం జగన్ తీసుకున్న 80కిపైగా నిర్ణయాలను చట్ట విరుద్దంగా ఉన్నాయని హైకోర్టు కొట్టి వేసింది. సుప్రీంకోర్టుకు వెళ్లినా తీర్పులో మార్పు రాలేదు. చివరికి నిన్న కూడా.. . టీడీపీ నేతల మైనింగ్ లీజులను రాజకీయ కారణాలతో రద్దు చేస్తే.. హైకోర్టు తప్పు పట్టింది. ఇలాంటివి కోకొల్లలు. చట్టాన్ని పాటించడం లేదని.. రాజ్యాంగ విరుద్ధ జీవోలిచ్చారని కోర్టులు తీర్పు చెబితే… న్యాయస్థానాలనే తప్పు పడుతున్నారు కానీ.. తాను చట్టాన్ని మించి ప్రవర్తిస్తున్నాననే సంగతిని అంచనా వేయడానికి సిద్ధపడటం లేదు. చట్టానికి.. రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా పాలన సాగుతోందన్న అభిప్రాయం అంతటా ఏర్పడుతోంది. మరి జగన్మోహన్ రెడ్డి తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో చెప్పిన దానికి.. తాను చేస్తున్న దానికి పోలిక ఎక్కడైనా ఉందేమో… పరిశీలించుకుని ఉంటారా..?
ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులున్నాయనే సామెత ఉంది. ఇది రాజకీయ నేతలకు వర్తిస్తుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లాంటి రాజకీయ నేతలకు ఇంకా ఇంకా ఎక్కువగా వర్తిస్తుంది. ఆయన చెప్పే ఆదర్శాలు… పెద్ద పుస్తకంగా రాయవచ్చు. కానీ ఆ ఆదర్శాల్లో ఆయన ఎన్నింటిని అమలు చేస్తున్నారనే అంశాన్ని రాసుకోవాలంటే… ఒక్క పేపర్ కూడా.. అవసరం లేదు. ఎందుకంటే.. ఆయన అసలు అమలు చేయడం లేదు మరి. ఇలా చేయడం వల్ల.. అంతిమంగా నష్టపోతోంది.. జగన్ కాదు.. టీడీపీ కాదు.. బీజేపీ కాదు…! అంతిమంగా నష్టపోతోంది.. రాష్ట్ర ప్రజలు.. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్..!