ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశ పెట్టిన ఉచిత విద్యుత్ పథకాన్ని ఎత్తివేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు.. కేంద్ర ప్రభుత్వానికి కూడా సమాచారం ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో ఉంది. అప్పులు పుడితే తప్ప.. రోజువారీ ఖర్చులు కూడా గడవని పరిస్థితి. జీతాలు, పెన్షన్లకు ఎప్పటికప్పుడు అప్పులు చేయాల్సి ఉంది. కానీ అప్పులు చేసే సామర్థ్యం తగ్గిపోయింది. చట్టాల ప్రకారం.. తీసుకోవాల్సిన అప్పు దాటిపోయింది. మరింత అప్పు కావాలంటే ఖచ్చితంగా కేంద్రం పెట్టే షరతులను అంగీకరించాలి. ఎఫ్ఆర్బీఎం రుణ పరిమితిని ఐదు శాతానికి పెంచుకోవాలంటే.. కేంద్రం పెట్టిన షరతు.. ఉచిత విద్యుత్‌ను ఎత్తివేయడం. దీనికి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని చెబుతున్నారు.
ఎఫ్ఆర్బీఎం పరిమితిని ఐదు శాతానికి పెంచుతూ… ఏపీ సర్కార్ ఓ ఆర్డినెన్స్ తీసుకు వస్తోంది. దానికి కేంద్రం ఆమోదముద్రపడాలంటే.. ఇక్కడ ఉచిత విద్యుత్ ను ఎత్తివేస్తూ.. నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అలా తీసుకున్న తర్వాతనే కేంద్రం అంగీకరిస్తుంది. అప్పుడే.. రాష్ట్రానికి ఓ ఇరవై వేల కోట్ల అప్పులు పుడతాయి. ప్రభుత్వం ఉచిత విద్యుత్‌ను ఎత్తివేసినా.. ఆ సొమ్మును రైతుల ఖాతాకు జమ చేస్తామని చెప్పే అవకాశం ఉంది. అంటే.. బిల్లులను ప్రభుత్వమే చెల్లించడం లేదా… రైతులు చెల్లిస్తే.. వారికి తిరిగి చెల్లించడం చేయాల్సి ఉంటుంది. అంటే.. ఖచ్చితంగా బిల్లింగ్ వేయాల్సి ఉంటుంది.
కేంద్రం ఈ షరతు పెట్టడానికి కారణం ఉంది. విద్యుత్ సంస్థలకు ప్రభుత్వాలు తమ ఎన్నికల హామీల్లో భాగంగా ఇస్తున్న రాయితీలకు సంబంధించి బిల్లులు చెల్లించడం లేదు. కరెంట్ వినియోగం లెక్కలు కూడా తేలడం లేదు. దీంతో డిస్కమ్‌లు వేల కోట్ల నష్టాల్లోకి వెల్లిపోతున్నాయి. ఈ పరిస్థితిని మార్చడానికి కేంద్రం సంస్కరణలు ప్రారంభించింది. కొద్ది రోజుల కిందట చేయాలనుకున్న కొత్త చట్టంలోనూ ఇదే ప్రధానాంశం. వీలైనంత త్వరగా.. ఉచిత విద్యుత్‌ను ఏపీ సర్కార్ ఎత్తివేసి.. ఎంత కరెంట్ బిల్లు వస్తుందో ఆ మొత్తాన్ని రైతులకే ఇస్తామని ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది.