ప్రభుత్వం అంటే.. ప్రజలు ఎన్నుకున్నది. ప్రజా ధనానికి జవాబుదారీ. ప్రజలు ఎన్నుకున్నారని.. ముఖ్యమంత్రి కుటుంబానికి చెందిన వ్యాపార సంస్థలకు ప్రజాధనాన్ని దోచి పెట్టకోకూడదు. కానీ దురదృష్టవశాత్తూ ఏపీలో అదే జరుగుతోంది. ముఖ్యమంత్రి కుటుంబానికి చెందిన… ముఖ్యమంత్రి సతీమణి డైరక్టర్‌గా సాక్షి మీడియాకు ప్రజాధనం ప్రకటనల రూపంలో వెల్లువెత్తుతోంది. అదీ కూడా నిబంధనలకు నీళ్లొదిలి.. కోట్లకు కోట్లు.. ప్రకటన రూపంలో వెళ్తోంది. దీనిపై హైకోర్టులో పిటిషన్ దాఖలయింది. సమాచార హక్కు చట్టం ద్వారా ఓ వ్యక్తి ఏడాది కాలంలో వివిధ మీడియా సంస్థలకు ఇచ్చిన ప్రకటనల వివరాలను తీసుకున్నారు. వాటిలో.. జారీ చేసిన ప్రకటనల్లో సగం.. సాక్షి మీడియాకే వెళ్లినట్లుగా గుర్తించారు.
ఏడాది కాలంలో దాదాపుగా రూ. అరవై నుంచి 70 కోట్ల రూపాయాలు.. సాక్షికి ప్రకటన రూపంలో వెళ్లాయి. అత్యధిక సర్క్యూలేషన్ ఉన్న పత్రిక కంటే… దాదాపుగా ఇరవై శాతం ఎక్కువ ప్రకటనలు సాక్షికి వెళ్లడం ఇందులో అవినీతి ప్రత్యక్ష సాక్ష్యంగా చెప్పుకోవచ్చని న్యాయనిపుణులు అంటున్నారు. ఏడాది కాలంలో.. సమాచార పౌరసంబంధాల శాఖ ద్వారా మొత్తం రూ. పదిహేడు కోట్ల రూపాయల ప్రకటనలు జారీ అయ్యాయి. ఇందులో రెండో అత్యధిక సర్క్యూలేషన్ ఉన్న సాక్షి పత్రికకు రూ. ఆరు కోట్లపైన వాటా ఉంది. మొదటి స్థానంలో ఉన్న ఈనాడుకు ఇచ్చింది రూ. నాలుగు కోట్ల ఇరవై లక్షల ప్రకటనలు మాత్రమే. మూడో స్థానంలో ఉన్న ఆంధ్రజ్యోతి పత్రిక పేరును అసలు దాదాపుగా బ్యాన్ చేసేశారు. ఇతర చిన్న పత్రికలకు అంత కంటే ఎక్కువే ఇచ్చారు. ఇవన్నీ ఒక్క ఐ అండ్ పీఆర్ రిలీజ్ చేసిన యాడ్స్ మాత్రమే..
ఇతర డిపార్టుమెంట్లు విడివిడిగా తమ ఖాతాల ద్వారా.. ప్రకటనలు జారీ చేశారు. ఇలా అవి మొత్తం ఖర్చు పెట్టిన మొత్తం రూ. 82 కోట్ల వరకూ ఉంది. ఈ మొత్తంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి పత్రికకు సహజంగానే మెజార్టీ వాటా వెళ్లింది. దాదాపుగా రూ. 35 కోట్లు సాక్షి ఖాతాలోకి వెళ్లాయి. సర్క్యూలేషన్‌లో మొదటి స్థానంలో ఉన్న ఈనాడుకు రూ. 27 కోట్ల ప్రకటనలు వెళ్లాయి. సహజంగానే ఆంధ్రజ్యోతికి మొండి చేయి ఎదురైంది. రూ. నాలుగంటే నాలుగు లక్షల రూపాయల విలువైన ప్రకటనలు మాత్రమే ఇచ్చారు. ఊరూపేరూ లేని పత్రికలకు … వస్తుందో రాదో అన్నట్లుగా ఉండే వార్తకు కూడా.. లక్షల్లో ప్రకటనలు ఇచ్చారు.
ఏ డిపార్టుమెంట్ ఎలా ప్రకటనలు ఇచ్చినా అది ప్రజాధనం. పదవిలో ఉన్న ప్రజాప్రతినిధులు.. తమ కుటుంబాలకు చెందిన వ్యాపార సంస్థలకు పిసరంతైనా మేలు చేయడానికి జంకుతారు. కానీ ఏపీలో అలాంటి పరిస్థితి కనిపిండం లేదు. ముఖ్యమంత్రి సొంత పత్రికకు.. నిబంధనలకు విరుద్ధంగా ప్రకటనలు వెళ్లాయి. ఎక్కడైనా అత్యధిక సర్క్యూలేషన్ ఉన్న పత్రికకు అత్యధిక ప్రకటనలు ఇస్తారు. కానీ ఇక్కడ సాక్షికి ఎక్కువ ప్రకటనలు వెళ్లడంతోనే అవినీతి ఏంటో తేటతెల్లమవుతుందని చెబుతున్నారు. ఈ అంశంపై హైకోర్టులో పిటిషన్ పడింది. ఒక వేళ విచారణకు ఆదేశిస్తే.. ఏం జరుగుతుందో అంచనా వేయడం కష్టమే..!