`ఆచార్య` కథపై పెద్ద రచ్చ జరుగుతోంది ఇప్పుడు. ఈ కథ నాదే అంటూ ఓ రచయిత గళం విప్పడం, కాదు.. కాదు. ఈ కథ నాదే.. అంటూ కొరటాల మీడియా ముందుకు రావడం టాక్ ఆఫ్ ది టౌన్ గా అయ్యింది. రాజేష్ అనే సహాయ దర్శకుడు ఈ పాయింట్ పై ఎప్పుడో ఓ కథ రాసుకుని, రచయితల సంఘంలో రిజిస్టర్ చేయించుకున్నాడు. వాస్తవానికి ఇలాంటి వివాదం చెలరేగినప్పుడు.. రెండు కథల్నీ పక్క పక్కన పెట్టి, వాటిలోని పోలికలు బేరీజు వేస్తారు. కానీ.. ఇప్పుడు అలా జరగడం లేదు.
ఎందుకంటే… రాజేష్ రాసుకున్న `పెద్దాయన` కథ రిజిస్టర్ అయ్యింది గానీ, `ఆచార్య` కథ రిజిస్టర్ అవ్వలేదు. ఆచార్య కథలో ఏముందో, ఏం లేదో… ఎవ్వరికీ తెలీదు. అంటే ఆ కథ `పెద్దాయన` కథ ఒకటేనా, కాదా అనేది సినిమా విడుదల అయితే గానీ తెలీదు. ఇంత పెద్ద సినిమా, పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు కథలు రిజిస్టర్ చేయించుకోవడం సహజం. కానీ.. కొరటాల శివ మాత్రం రిజిస్టర్ చేయించకపోవడం ఆసక్తి కరంగా మారింది. కొంతమంది పెద్ద దర్శకులు కథల్ని రిజిస్టర్ చేయించరు. అలా చేయిస్తే.. ఆ కథలు ఏదో ఓ రూపంలో, బయటకు వచ్చేస్తాయని భయం. రిజిస్టర్ చేయించుకుంటే, ఇలాంటి వివాదాలు చెలరేగినప్పుడు ఉపయుక్తంగా ఉంటాయి.