రెండ్రోజుల నుంచీ… ‘ఆచార్య’ వ్యవహారం బాగా నలుగుతోంది. ఈ కథపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. రాజేష్ అనే వర్థ మాన రచయితకీ, కొరటాల శివ అనే పెద్ద దర్శకుడికీ మధ్య వాదోపవాదాలూ జరిగాయి. అంతిమంగా… ‘ఆచార్య’పై రాజేష్ చేస్తున్న ఆరోపణల్లోనే బలం లేదని తేలిపోయింది.
‘ఆచార్య’ కథ ఇదీ… అంటూ రాజేష్ చెప్పిన కథకూ ‘ఆచార్య’గా తీస్తున్న కథకూ ఎలాంటి పొంతన లేదని `ఆ కథ ఈ కథ వేరు` అని కొరటాల శివ బలంగా చెబుతున్నారు. అదీ మీడియా సాక్షిగా. కానీ రాజేష్ మాత్రం `మీరు మీకు తెలియకుండానే నా కథ తీస్తున్నారు` అని చెప్పడం హాస్యాస్పదంగా తోస్తోంది. కొరటాల శివ మీడియా ముందుకొచ్చి మరీ వివరణ ఇచ్చుకున్నారు. ఒకవేళ ఆయన తప్పు మాట్లాడితే, అబద్ధం చెబితే – రేపు `ఆచార్య` విడుదలయ్యాక… అదే మీడియా ముందు, అదే జనం ముందు కొరటాల సమాధానం చెప్పాల్సివస్తుంది. అలాంటప్పుడు ఆయన మసి పూసి మారేడు కాయ చేసే ప్రయత్నం చేయరు కదా?
కొరటాల శివ కో డైరెక్టర్ తో తాను ఫోన్లో మాట్లాడినట్టు.. తన కథే ఈ సినిమాగా తీస్తున్నారని, ఆ కో డైరెక్టర్ ఒప్పుకున్నట్టు – రాజేష్ చెబుతున్నారు. అందుకు సంబంధించిన ఫోన్ రికార్డు కూడా తన దగ్గర ఉందన్నారు. తీరా.. ఓ టీవీ ఛానల్ లైవ్ లో ఫోన్ రికార్డు కోసం ఆరా తీస్తే.. `అది నా దగ్గర లేదంటూ` రాజేష్ చేతులెత్తేశారు. ”నా కో డైరెక్టర్ తో నేను మాట్లాడాను. ఆయన ఈ కథ గురించి ఎవరికీ ఏం చెప్పలేదన్నారు. నా దగ్గర పనిచేసే వ్యక్తి.. నా గురించో, సినిమా గురించో తప్పుగా ఎందుకు మాట్లాడతారు?” అన్నది కొరటాల వాదన. ”రాజేష్ గారి కథ కీ నాకూ సంబంధం లేదు. ఆయన ఆ కథతో సినిమా తీసుకోవొచ్చు. నా సినిమా కంటే ముందు రిలీజ్ చేసుకోవొచ్చు. కావాలంటే మీడియా ముఖంగా సంతకం చేసి ఇస్తా. ఇంతకంటే ఏం చేయగలను? ఈ ఇష్యూని చిరంజీవిగారి దగ్గరకు తీసుకెళ్లాలన్నది రాజేష్ ప్రయత్నం కావొచ్చు. నేను మీడియా ముందుకు వచ్చాను కాబట్టి, ఈ వివాదం గురించి చిరంజీవిగారికి తెలిసిపోతుంది. తెలియకపోయినా నేనే చెప్తా. ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేసినందుకు రాజేష్‌పై చట్టబద్దమైన చర్యలు తీసుకుంటా” అన్నారు కొరటాల శివ.
ఉత్సవం నేపథ్యంలో కొరటాల ఓ పాట తీసినట్టు, ఓ ఫైటు కూడా తెరకెక్కించినట్టు, తనకథలోనూ అలాంటి పాట, ఫైటు ఉన్నట్టు చెబుతున్నారు రాజేష్. దీన్ని సైతం కొరటాల ఖండించారు. ”ఉత్సవం నేపథ్యంలో పాటా, ఫైటూ రెండూ తీయలేదు. నేను అబద్ధం చెప్పినా నా ఎడిటరూ, అందులో నటించిన చిరంజీవి గారూ చెప్పరు కదా..” అన్నది కొరటాల పాయింట్. అసలు తనది దేవాదాయ భూముల నేపథ్యంలో నడచే కథే కాదని కొరటాల బల్లగుద్దీ మరీ చెబుతున్నారు. సోషల్ మీడియాలో ఆచార్య గురించి చాలా కథలు సర్క్యులేట్ అవుతున్నాయి. వాటిని ఆధారంగా చూపిస్తూ.. `నా కథ కూడా ఇలాంటిదే` అని చెప్పడం నిజంగా అమాయకత్వంలా అనిపిస్తోంది. కొరటాల శివ లాంటి దర్శకుడు మీడియా ముందుకొచ్చి.. `నా కథ ఇది కాదు. కావాలంటే సంతకం పెట్టిస్తా` అని చెబుతుంటే – ఇది తన కథే అని నిరూపించుకోవడానికి రాజేష్ దగ్గర ఎలాంటి ఆధారాలూ లేకపోతే – ఇక ఈ వాదనల్లో బలం ఎక్కడి నుంచి వస్తుంది?