చంద్రబాబు కులతత్వవాది, టీడీపీ కులపిచ్చి పార్టీ అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. అదే సమయంలో కులాలతో సంబంధంలేకుండా జగన్ అన్నివర్గాలకు న్యాయం చేస్తున్నారని సర్టిఫికెట్ కూడా మంజూరు చేశారు. విశాఖకు చెందిన మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్‌బాబును వైసీపీలో చేర్చుకునేందుకు.. క్యాంప్ ఆఫీసుకు తీసుకు వచ్చిన విజయసాయిరెడ్డి..జగన్ తో కండువా కప్పించారు. ఆ తర్వాత బయటకు వచ్చి మీడియాతో…కులం గురించి మాట్లాడారు. ఓ వైపు… అన్నిరకాల పదవులు రెడ్లకే ఇస్తున్నారని.. రెడ్డియిజం రాష్ట్రంలో అమలు చేస్తున్నారని అన్ని వైపు నుంచి విమర్శలు వస్తున్న తరుణంలో ఆయన టీడీపీపై రివర్స్ ఆరోపణలు ప్రారంభించారు.
చంద్రబాబును కులతత్వవాది అని చెప్పుకొచ్చారు. తెలుగుదేశంపై ఓ కులం ముద్ర వేయడానికి ఎన్నికల ముందు నుంచీ..ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలో సాగిన ప్రచారాన్ని విజయసాయిరెడ్డి..ఇంకా ఇంకా కొనసాగిస్తున్నారు. తాము అధికారంలో ఉన్నప్పటికీ.. సామాజిక న్యాయం అనే మాట లేకుండా…చూసుకుంటూనే..జగన్ అన్ని కులాలకు న్యాయం చేస్తున్నారని సర్టిఫికెట్ కూడా ఇచ్చేస్తున్నారు.
అదే సమయంలో.. తమను ఇబ్బంది పెడుతున్న రఘురామకృష్ణరాజుపై మాత్రం..మరీ తనదైన శైలిలో ఘాటుగా స్పందించలేదు. ఆయన వైసీపీలో క్రమశిక్షణ ఉల్లంఘించారని.. రఘురామకృష్ణరాజును డిస్క్వాలిఫై చేయాలని స్పీకర్‌ను కోరామని చెప్పుకొచ్చారు. స్టాండింగ్ కమిటీ నుంచి కూడా తొలగించాలని కోరామన్నారు. వైసీపీలో గతంలో ఉన్నంత ప్రాధాన్యం ఇప్పుడు విజయసాయిరెడ్డికి దక్కడం లేదు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఎక్కువగా ట్వీట్లకే పరిమితం అయ్యారు. ఇటీవల విశాఖలో జరిగిన ఓ అధికారిక కార్యక్రమంలో స్టేజ్ పైకి కూడా వెళ్లలేదు. గతంలో సమీక్షలు కూడా నిర్వహించే విజయసాయిరెడ్డి ఇలా మారిపోవడం ఏమిటన్న చర్చ ఆ పార్టీలో నడుస్తోంది.