దేశంలో నెంబర్ టూ స్థానానికి ఆంధ్రప్రదేశ్ చేరింది. అభివృద్ధిలోనో… ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లోనో కాదు కరోనా కేసుల్లో. మెట్రో సిటీలు లేకుండానే ఆంధ్రప్రదేశ్ ఈ ఘనత సాధించింది. అన్ని రాష్ట్రాల కంటే ముందు మహారాష్ట్ర ఉండగా. .. ఇప్పటి వరకూ తమిళనాడు ఈ స్థానంలో ఉండేది. ఇప్పుడు… రోజుకు పదివేల కేసులకుపైగా.. నమోదు చేసుకుంటూ.. ఏపీ తమిళనాడును వెనక్కి నెట్టేసింది. మొదట్లో మహారాష్ట్ర,తమిళనాడు కోవిడ్ హాట్ స్పాట్లుగా ఉన్నాయి. ఇప్పుడు అక్కడ వైరస్ను ఎలాగోలా కంట్రోల్ చేయగలిగారు కానీ.. ఏపీలో మాత్రం కట్టు తప్పింది.
గత ఇరవై నాలుగు గంటల్లో ఏపీలో కొత్తగా 10,526 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఓవరాల్గా నాలుగు లక్షల కేసులు నమోదయినట్లయింది. ఇందులో యాక్టివ్ కేసులు 96191. అత్యధిక యాక్టివ్ కేసులు ఉన్న రాష్ట్రాల్లో ఏపీ ఎప్పుడో రెండో స్థానానికి చేరింది. ఏపీ కన్నా మహారాష్ట్రలో మాత్రమే అత్యధిక యాక్టివ్ కేసులు ఉన్నాయి. మరణాలు కూడా రోజుకు వందకు దరిదాపుల్లో ఉంటున్నాయి.
మరణాలు అనూహ్యంగా పెరగడంపై కేంద్రం కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఏం జరుగుతోందంటూ ఏపీ సర్కార్కు లేఖ రాసింది. ప్రత్యేకంగా ఏం చర్యలు తీసుకుంటున్నారో ఏపీ సర్కార్ చెప్పడం లేదు. కరోనా మాత్రం కంట్రోల్ కావడం లేదు. అందరికీ వస్తుంది.. పోతుందన్న పాలసీని ఏపీ సర్కార్ అమలు చేస్తోంది.