ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కర్నూలు జిల్లా సంగమేశ్వరం వద్ద నిర్మించతలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంలో తెలంగాణ సర్కార్ ఇప్పటి వరకు నిగూఢంగా దాచుకున్న అనుమానాన్ని బయట పెట్టింది. అతి ఎత్తిపోతల కాదని.. ఏకంగా నదినే మళ్లించే ప్రయత్నం అని వాదిస్తోంది. ఎన్జీటీలో జరిగిన వాదనల్లో తెలంగాణ ఈ విషయాన్ని ట్రైబ్యునల్ ముందు చెప్పింది. కావాలంటే… ఏపీ సర్కార్ ఎలా నదిని మళ్లించాలనుకుంటుందో… తాము హెలికాఫ్టర్లో తీసుకెళ్లి చూపిస్తామని కూడా అధికారులు ట్రైబ్యునల్ దృష్టికి తీసుకెళ్లారు. రాయలసీమ ఎత్తిపోతల కొత్త ప్రాజెక్ట్ కాదని.. పర్యావరణ అనుమతులు అవసరం లేదని కేంద్రం చెబుతున్న సమయంలో… తెలంగాణ అసలు నదినే మళ్లిస్తున్నారనే వాదన తీసుకురావడం ఆసక్తికరంగా మారింది. ఇలాంటి వాటిని నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ అసలు అంగీకరించదు కాబట్టి.. తెలంగాణ ఈ వాదన తీసుకొచ్చిందని భావిస్తున్నారు.
శ్రీశైలం దాదాపుగా నిండిన తర్వాతనే.. పోతిరెడ్డి పాడు నుంచి నీరు విడుదల చేయడానికి అవకాశం ఏర్పడుతోంది. అయితే.. అలా నిండక ముందే.. దిగువ నుంచి తెలంగాణ నీటిని తరలించుకుంటోంది. ప్రాజెక్టులోకి చేరే కొద్దో గొప్పో నీరు విద్యుత్ ఉత్పాదన ద్వారా కిందకు తరలిస్తోంది. దీంతో.. రాయలసీమకు నీరు అందని పరిస్థితి ఏర్పడుతోంది. అందుకే.. ఏపీ ప్రభుత్వం తమకు కేటాయించిన నీటిని వాడుకునేందుకు..సంగమేశ్వరం వద్ద ఎత్తిపోతల నిర్మిస్తున్నామని చెబుతోంది. కానీ తెలంగాణ మాత్రం.. దానికి అడ్డు చెబుతోంది. అది ఎత్తిపోతల కాదని.. కృష్ణానదినే మళ్లించే ప్రాజెక్ట్ అని చెబుతోంది.
ఈ జల వివాదాల పరిష్కారానికి కేంద్రం అపెక్స్ కౌన్సిల్ భేటీ నిర్వహించాలని ప్రయత్నించింది. కానీ ప్రయోజనం లేకపోయింది. ఓ సారి కేసీఆర్ వాయిదా కోరారు. మరోసారి సమావేశాన్ని నిర్వహించాల్సిన కేంద్రమంత్రిగా కరోనా వచ్చింది. దాంతో రెండు సార్లు అపెక్స్ సమావేశాలు వాయిదా పడ్డాయి. ఇప్పుడు…ఈ వివాదం.. అంతకంతకూ పెరుగుతోంది. మరో వైపు ఏపీ సర్కార్ మాత్రం టెండర్లను ఖరారు చేసి.. పనులు ప్రారంభించడానికి సిద్ధమవుతోంది.