బషీర్ బాగ్ కాల్పుల ఘటనకు ఇరవై ఏళ్లు అయ్యాయంటూ మీడియా సంస్థలు.. ప్రత్యేక కథనాలు ప్రచారం చేశాయి. అప్పట్లో చంద్రబాబు సీఎంగా ఉన్నారు. ఆయన విద్యుత్ సంస్కరణలు చేపట్టి చంద్రబాబు… చార్జీలు పెంచారు. ఆ సమయంలో కమ్యూనిస్టులు భారీ ఉద్యమాన్ని నిర్మించారు. చలో హైదరాబాద్‌కు పిలుపునిచ్చారు. పరిస్థితులు చేయిదాటడంతో…పోలీసులు కాల్పులు జరిపారు. అప్పుడు ముగ్గురు చనిపోయారు. ఆ ఘటనను రాజకీయ పార్టీలు.. ఇప్పటికీ వాడుకుంటున్నాయి. సానుభూతి మీడియాలతో వార్షికోత్సవాలు నిర్వహిస్తూనే ఉన్నారు. కానీ.. ఆ తర్వాత అంతకు మించి ఘటనలు జరిగాయి. అందులో ఒకటి ముదిగొండ కాల్పుల ఘటన.
భూపోరాటంపై బుల్లెట్ల వర్షం..!
అది 2007 సంవత్సరం. ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి సర్కార్… తాయిలాలతో సమయం గడుపుతున్న సందర్భం. ప్రతి పేదవాడికి స్థలం కోసం కమ్యూనిస్టులు భారీ ఉద్యమం చేపట్టారు. అది చిన్నగా ప్రారంభమై.. ఉద్ధృతమైంది. ఎంతగా అంటే.. రాష్ట్రం మొత్తం కదిలిపోయే పరిస్థితి ఏర్పడింది. అణిచివేయకపోతే.. అది మహోద్యమం అవుతుందని అనుకున్నారు పాలకులు. ఆ అణిచివేత సరైన ప్రదేశం ఖమ్మం జిల్లాలోని ముదిగొండను ఎంచుకున్నారు. ముదిగొండ బస్టాండ్ సెంటర్లో శాంతియుతంగా భూమికోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం జరుగుతున్న ధర్నాపై పోలీసులు విరుచుకుపడ్డారు. కమ్యూనిస్టు నేత బండి రమేష్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు, భూమి లేని నిరుపేదలకు ప్రభుత్వం భూములు పంచాలని, ఇంటి జాగాలు లేని ప్రజలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై ధర్నా నిర్వహించారు. శాంతియుతంగా కొనసాగుతున్న భూ పోరాట ఉద్యమంపై ఒక్కసారిగా పోలీసులు విరుచుకుపడ్డారు. ఎలాంటి హెచ్చరికలు లేకుండా పార్టీ కార్యకర్తలపై లాఠీచార్జీ చేశారు. అమానుషంగా పోలీసు కాల్పులు జరిపారు. దీంతో పోలీసు కాల్పుల్లో పార్టీ కార్యకర్తలు ఏడుగురు మృతి చెందారు. ఇసుకల గోపయ్య, ఎనగందుల వీరన్న, కత్తుల పెద్దలక్ష్మీ, బంకా గోపయ్య, పసుపులేటి కుటుంబరావు, జంగం బాలస్వామి, చిట్టూరి బాబురావు అనే అక్కడికక్కడే చనిపోయారు. 16 మందికి తీవ్ర బుల్లెట్ల గాయాలు కాగా మరో ముగ్గురు శాశ్వత వికలాంగులయ్యారు.
ముదిగొండ ఘటన జరిగిన క్రమం.. కుట్రకు సాక్ష్యం..!
జూలై 28 ముదిగొండలో ప్రశాంతంగా బంద్ జరుగుతున్నది. సి.ఐ. సురేందర్ రెడ్డి, ఎస్.ఐ. వెంకటరెడ్డి తమ బలగాలతో వచ్చి.. క్షణాలలో నిరాహారదీక్ష శిబిరాన్ని ఖాళీ చేయాలని హెచ్చరించారు. దానికి కమ్యూనిస్టు నేతలు నిరాకరించారు. ‘మీసంగతి చూస్తానని, ప్రళయం జరగాలి’ అంటూ చిటికెలు వేసుకుంటూ వెనక్కు వెళ్లిన పోలీసులు అదనపు బలగాలతో వచ్చి ఆయుధాలతో దీక్షా శిబిరాన్ని చుట్టుముట్టి దాడిచేశారు. సి.పి.ఎం. నాయకుడు బండి రమేష్‌ను నడి రోడ్డుమీద ఈడ్చుకెళ్లి సి.ఐ., ఎస్.ఐ. కొందరు పోలీసులు లాఠీలు, తుపాకీ మడమలతో కొట్టారు. తమ నాయకుడిని రక్షించుకునేందుకు కార్యకర్తలు ముదుకు రావడంతో దీనిని ఆసరాగా తీసుకొని విచక్షణారహితంగా పోలీసులు కాల్పులు జరిపారు.
పరిస్థితులు చేయిదాటనే లేదు.. కేవలం అణిచివేతకు మాత్రమే..!
ముదిగొండ కాల్పులు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. పోలీస్ కాల్పులు ముదిగొండ గ్రామం నడిబొడ్డున ఏడుగురు వీరుల నెత్తుటి సంతకంతో భూమి తడిసిపోయింది.ముదిగొండ భూ పోరాట ఉద్యమ వీరులపై పోలీసులు జరిపిన కాల్పులు మారుమోగి దేశం నలుమూలలకు వ్యాపించింది. కాంగ్రెస్ హయాంలో జరిగిన ముదిగొండ పోలీసుల కాల్పులు కాంగ్రెస్ పార్టీకి అప్రతిష్ట తెచ్చిపెట్టింది. సీఎం రాజశేఖర్ రెడ్డి అణిచివేత విధానాలకు సాక్ష్యంగా నిలిచింది. ఎలాంటి ప్రమాదకర పరిస్థితులు లేకపోయినా పోలీసులు కాల్పులు జరపడం.. అంతా ప్లాన్ ప్రకారమే జరిగిందన్న ఆరోపణలు వచ్చాయి. ఓ రకమైన క్రూరమనస్థత్వంతో పాలకులు ఉంటే… ఆందోళనలు అదుపు తప్పకుండానే .. ఉద్యమాన్ని అణిచి వేయడానికి ఏం చేయాలో.. అది చేస్తారన్నదానికి ముదిగొండ ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది.
నాటి బషీర్‌బాగ్ అయినా.. ఆ తర్వాత ముదిగొండ అయినా… పాలకుల కర్కశత్వానికి ప్రతీకగా నిలిచింది. ప్రజా ఉద్యమాలను అణిచివేయాలనే ప్రయత్నాలే జరిగాయి. ఇప్పుడు.. కాలం మారింది. విద్యుత్ చార్జీలు పెంచినా…పెట్రోల్ చార్జీలు బాదేసినా ప్రజల్లో చలనం లేకుండా పోయింది. ఉద్యమాల ఊసే లేకుండా పోయింది.