61 ఏళ్ల నాగార్జునని చూస్తుంటే…
ఇంకా శివ, గీతాంజలి, నిన్నే పెళ్లాడతా రోజుల్లోనే ఉండిపోయాడా అనిపిస్తుంది.
వయసు ఓ అంకె మాత్రమే – అని ఎప్పటికప్పుడు నిరూపించుకుంటూ – `మన్మథుడు` అనే ట్యాగ్ లైన్‌ని అనునిత్యం కాపాడుకుంటూ ప్రయాణం చేస్తున్నాడు కింగ్ నాగార్జున.
సాధారణంగా గ్లామర్ అనే పదాన్ని హీరోయిన్లకు వాడతాం. కానీ… హీరోలూ ఆ `గ్లామర్`తో మెరిపిస్తారు అనడానికి నాగ్ ఓ స్వచ్ఛమైన నిదర్శనం. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ,వెంకటేష్.. వీళ్లంతా ఓ తరం హీరోలు. ఇప్పటికీ… హీరోలుగానే చలమణి అవుతున్నారు. వీళ్లందరిలోనూ.. వయసు దాచేసుకోలిగిన ట్రిక్కు. కేవలం నాగార్జునకి మాత్రమే తెలుసనిపిస్తుంటుంది. అందుకే… వీళ్లందరిలోకంటే ఎక్కువ లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకోగలిగాడు నాగార్జున.
నాగ్ అంటే క్లాస్.
నాగ్ అంటే మ… మ…మాస్.
రెండూ తనవే.
ఎప్పుడు `హలో బ్రదర్`లాంటి పక్కా ఎంటర్టైన్మెంట్లు చేస్తాడో. ఎప్పుడు `అన్నమయ్య`లా భక్తిరసంలో ముంచెత్తుతాడో ఎప్పడం కష్టం. నాగ్ చేసిన సాహసాలు, విభిన్న ప్రయోగాలూ మరో అగ్ర హీరో చేయలేదంటే నమ్మాల్సిందే.
`నిన్నే పెళ్లాడతా` తరవాత.. `అన్నమయ్య`లాంటి కథని ఎంచుకోవడానికి హీరోకి ఎన్ని గట్స్ ఉండాలి?
ఎలాంటి అనుభవమూ లేని రాంగోపాల్ వర్మని నమ్మి `శివ` ప్రాజెక్టు అతని చేతిలో పెట్టడానికి ఎన్ని గుండెలు ఉండాలి? కొత్త దర్శకుల్ని నాగార్జున ప్రోత్సహించినంతగా మరో హీరో.. దగ్గరకు చేర్చుకోలేదనిపిస్తోంది. వర్మ, కృష్ణవంశీ, వి.ఎన్.ఆదిత్య, లారెన్స్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో. కొత్త వాళ్లతో చేస్తూనే.. ఎక్కువ దెబ్బలూ తిన్నాడు. మల్టీస్టారర్ సినిమాలు ఇప్పుడో ట్రెండ్ గా మారాయి గానీ, అప్పట్లోనే ఈ సినిమాల విలువ తెలుసుకున్న కథానాయకుడు నాగ్. బుల్లి తెరపై అడుగుపెట్టీ.. విజయవంతం అయ్యాడు. మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపాడు. బిగ్ బాస్‌ని రక్తి కట్టించాడు. ఇప్పుడు మరో సీజన్ కోసం సమాయాత్తం అవుతున్నాడు.
ఈరోజు నాగార్జున పుట్టిన రోజు. తను ఇలాంటి పుట్టిన రోజులు ఇంకెన్నో జరుపుకోవాలి. మరింత మంది ప్రతిభావంతుల్ని తెరపైకి తీసుకురావాలి.
హ్యాపీ బర్త్ డే టూ కింగ్!!