సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసులో రియా పాత్ర ఎంత ఉందో బయటకు రాక ముందే ఆమె బాధితురాలిగా మారిపోతోంది. సీబీఐతో పోటీ పడి మీడియా విచారణ జరుపుతోంది. అదిగో తోక అంటే.. ఇదిగో పులి అన్నట్లుగా వెంటాడుతున్నారు. ఆమెకు సీబీఐ సమన్లు ఇస్తే.. కనీసం సీబీఐ ఆఫీసు ముందు వంద మీడియా చానళ్లు లైవ్ కోసం రెడీగా ఉంటున్నాయి. ఆమె ప్రతీ అడుగును.. విశ్లేషించి.. విమర్శిస్తున్నాయి.
సీబీఐ ప్రశ్నలు మాత్రమే బయటకొస్తున్నాయి.. ఆన్సర్ల సంగతేంటి..?
సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని సీబీఐ సుదీర్ఘంగా విచారించింది. గతంలో ఈడీ ముందుకు హాజరైంది. ఆమెను ఈడీ పిలవడానికి కారణాలేమిటో ఎవరికీ తెలియదు. పదిహేను కోట్లు సుశాంత్ మనీ.. ఆమె ఖాతాకు ట్రాన్స్ ఫర్ అయిందని చెప్పుకున్నారు. అంతా అయిన తర్వాత ఒక్క రూపాయి కూడా ట్రాన్స్ ఫర్ కాలేదని తేల్చారు. ఇది తేల్చడానికి రియాను.. పిలిచి.. మీడియా ముందు హడావుడి చేయాల్సిన పని లేదు. బ్యాక్ స్టేట్‌మెంట్‌తోనే తేలిపోతుంది. ఇప్పుడు సీబీఐ దర్యాప్తులోనూ అంతే. మరో సీబీఐ అనేక ఆధారాలు సేకరించిందని.. సిద్ధార్థ పితాని, సహాయకుడు నీరజ్, వంట మనిషి కేశవ్, హౌస్‌కీపర్ దీపేశ్ సావంత్‌ల సంచలన విషయాలు బయట పెట్టారని విస్తృతంగా మీడియాలో ప్రచారం జరుగుతోంది. అంతా సీబీఐ సోర్స్ ప్రకారమే చెబుతున్నారు.
రియా ప్రతీ అడుగుపైనా కన్ను.. దర్యాప్తు సంస్థలదీ అదే దారీ..!
రియా చక్రవర్తి తండ్రి, సోదరుడిని కూడా సీబీఐ దర్యాప్తు బృందం ప్రశ్నిచింది. 14 గంటల పాటు రియా సోదరుడు షోవిక్ చక్రవర్తిని ప్రశ్నించింది. సుశాంత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడని తొలుత భావించినప్పటికీ.. హత్య జరిగిందనే అనుమానాలతో ఈ కేసును సీబీఐ దర్యాప్తు చేస్తోందని మీడియా చెబుతోంది. అటు ఈడీ కూడా పలుమార్లు నిందితులను ప్రశ్నించింది. మరో వైపు.. ఈ కేసులో ఉన్న సంచనాలకు తోడు… డ్రగ్స్ కోణం కూడా బయటకు వచ్చింది. నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో కూడా ఈ వ్యవహారంలో పలువురికి సమన్లు జారీ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. కంగనా రనౌత్ వంటి వాళ్లు.. వారియర్స్‌గా ముదుకొచ్చేస్తున్నారు. మీడియా వారికి కావాల్సినంత పబ్లిసిటీ చేసి పెడుతోంది.
మీడియానే శిక్ష విధించేయడం ఖాయంగా కనిపిస్తోంది..!
బాలీవుడ్‌లో ఎఫైర్లు కామన్. ఒక్క హీరో.. ఎంత మందితో… ఒక్క హీరోయిన్ ఎంత మందితో డేటింగ్ చేస్తుందో అంచనా వేయడం కష్టం. అక్కడి లైఫ్ స్టైల్ అలాంటిది. సుషాంత్ కేసే తీసుకుంటే.. రియా చక్రవర్తి .. సుషాంత్‌కు.. మూడు లేదా నాలుగో గర్ల్ ఫ్రెండ్ అని అందరూ చెబతూనే ఉన్నారు. అయినప్పటికీ.. రియా బ్రేకప్ చేసేసుకుంది కాబట్టి.. ఆమెనే నిందితురాలిగా మీడియా తీర్పులిచ్చేస్తోంది. అర్థమే లేని వాట్సాప్ చాట్స్‌తో … తమదైన అర్థాలు తీసుకుని శిక్ష ఖరారు చేసే ప్రయత్నాలు చేస్తోంది. ఈ మానసిక టార్చర్ భరించలేక.. సుశాంత్ తరహాలో.. రియా కూడా తనను తాను శిక్షించుకునేవరకూ.. మీడియా విచారణ చేస్తూనే ఉంటుందేమో..?