కాంగ్రెస్ సీనియర్లు … పార్టీ హైకమాండ్‌కు భిన్నమైన సందేశం పంపుతున్నారు. పోరాడాల్సింది తమతో కాదని..బీజేపీతో అని.. హైకమాండ్‌కు హితవు చెబుతున్నారు. సీనియర్ల పదవులు కట్ చేస్తూ నిర్ణయాలు తసుకుంటూండటమే దీనికి కారణం. అయితే.. ఇక్కడ కాంగ్రెస్ సీనియర్లకు అర్థం కాలేదో.. అర్థం కానట్లుగా ఉంటున్నారో కానీ.. వారంతా.. కాంగ్రెస్ లో భాగమై.. బీజేపీతో పోరాడాల్సి ఉంది. కానీ బీజేపీతో పోరాటంలో తమకు సంబంధం లేదన్నట్లుగా ఉంటూ.. కాంగ్రెస్ అంటే.. సోనియా, రాహుల్ అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు. దాంతోనే గ్రాండ్ ఓల్డ్ పార్టీకి కష్టకాలం ప్రారంభమయింది.
పార్టీని.. పార్టీకి పిల్లర్‌గా ఉన్న గాంధీ కుటుంబాన్ని డ్యామేజ్ చేసేలా లేఖ రాయడమే కాకుండా.. దాన్ని లీక్ చేసి.. బీజేపీకి మేలు చేశారన్న విషయం స్పష్టం. ఇప్పుడు వివాదాన్ని మరింత పెద్దగా చేస్తున్నారు కానీ వెనక్కి తగ్గడం లేదు. బ్లాక్ స్థాయి నుంచి వర్కింగ్ కమిటీ సహా అన్ని పదవులకు ఎన్నికలు జరిపి తీరాల్సిందేనని డిమాండ్ ప్రారంభించారు. అలా జరగని పక్షంలో కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులుండవని.. మరో 50 ఏళ్ల పాటు విపక్షంలో కూర్చోవడం ఖాయమని రెబెల్స్ హెచ్చరిస్తున్నారు.గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్ రోజుకో ప్రకటన చేస్తున్నారు.
నిజానికి ఈ సీనియర్లంతా నిన్నటి దాకా గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితులు. ప్రజల్లో పలుకుబడి లేకపోయినా గాంధీల ప్రాపకంతో పదవులు పొందారు. అయినా ఇప్పుడు వారితోనే తలపడుతున్నారు. ఇంత కాలం ఎవరి చల్లని చూపు కోసం ప్రయత్నించారో.. వారే ఇప్పుడు పార్టీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు, నిర్మాణాత్మక మార్పుల దిశగా పార్టీని నడిపించేందుకు తాము ప్రయత్నిస్తున్నామని చెబుతున్నారు. అధిష్టానం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ తమను ద్రోహులుగా చూస్తోందని ఆజాద్, కపిల్ సిబల్ అంటున్నారు. మొత్తానికి కాంగ్రెస్‌లో బీజేపీతో పోరాడాల్సింది ఎవరు.. కాంగ్రెస్ హైకమాండ్ మాత్రమేననా.. ఆ పార్టీ నేతలు కూడానా..?