రాజధాని రైతులకు అండగా ఉంటామని మొదటి నుంచి చెబుతున్న జనసేన పార్టీ.. ఆ దిశగా న్యాయపోరాటంలో పాలు పంచుకోవాలని నిర్ణయించింది. ఈ మేరకు హైకోర్టులో జనసేన పార్టీ తరపున కౌంటర్ దాఖలు చేయాలని నిర్ణయించుకుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్.. రాజకీయ వ్యవహారాల కమిటీతో పాటు ముఖ్య నేతలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాజధాని కోసం 33 వేల ఎకరాలు ఇచ్చిన రైతులకు అన్యాయం జరగకూడదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అమరావతి విషయంలో జనసేన మొదట్నుంచీ స్పష్టంగా ఉందన్నారు. పర్యావరణ హిత రాజధాని కావాలని మొదటి నుంచి చెబుతున్నామని చెప్పుకొచ్చారు.
ఎన్నికలకు ముందు అమరావతి రాజధానిగా ఉంటుందని భరోసా ఇచ్చి ఆ తర్వాత మాట మార్చాలని ఆరోపిస్తూ.. రైతులు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు సీఎం జగన్ తో పాటు మిగిలిన అన్ని పార్టీలకూ నోటీసులు జారీ చేసింది. అన్ని రాజకీయ పార్టీలకూ.. కౌంటర్ దాఖలు చేసే అవకాశం ఇవ్వడంతో.. తాము కూడా.. కౌంటర్ దాఖలు చేయాలని జనసేన పార్టీ నిర్ణయించుకుంది. ఇప్పటికే… హైకోర్టు బీజేపీకి కూడా నోటీసులు ఇచ్చినందున ఆ పార్టీ కూడా విడిగా కౌంటర్ దాఖలు చేయనుంది. జనసేన తన అభిప్రాయాన్ని కోర్టుకే వెల్లడించనుంది.
అమరావతికి మద్దతుగా మొదట్లో దూకుడుగా ఉన్న పవన్ కళ్యాణ్.. బీజేపీతో పొత్తు తర్వాత సైలెంటయ్యారు. దీంతో బీజేపీతో కలిసి ఆయన పొలిటికల్ గేమ్ ఆడుతున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. సోము వీర్రాజును ఏపీ బీజేపీ అధ్యక్షుడ్ని చేసిన తర్వాత అమరావతి విషయం లో ఆ పార్టీ స్టాండ్‌పై క్లారిటీ వచ్చేస్తోంది. దాంతో పవన్ ఏం చేస్తారన్నదానిపై ఉత్కంఠ ఏర్పడింది. ఇప్పటి వరకూ ఏమీ చెప్పకపోయినా… న్యాయపోరాటానికి తమ వంతు కృషి చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తాజా ” కౌంటర్”తో తేలిపోయిందని అనుకోవచ్చు.