లాక్డౌన్ నుంచి అన్నింటికీ మినహాయింపులు లభిస్తున్నాయి కానీ.. సినిమాహాళ్లకు మాత్రం దొరకడం లేదు. అన్‌లాక్ -4 నిబంధనల్లోనూ.. సినిమా హాళ్లు తెరుచుకోవడానికి కేంద్రం చాన్సివ్వలేదు. కొద్ది రోజుల కిందట.. షూటింగ్‌లకు అనుమతి ఇవ్వడంతో.. ఇక ధియేటర్లకూ అనుమతి ఇవ్వడం లాంచనమేనని అనుకున్నారు. కానీ.. మరో నెల పాటు.. నిషేధాన్ని కొనసాగిస్తూ నిర్ణయం ప్రకటించారు. సినిమా హాళ్లతో పాటు స్విమ్మింగ్ పూల్స్, ఎమ్యూజ్మెంట్ పార్క్‌లకు కూడా అనుమతి లేదు.
మెట్రో రైళ్లకు మాత్రం కేంద్రం అనుమతి ఇచ్చింది. సెప్టెంబర్ 7నుంచి మెట్రో రైళ్లు నడిపించుకోవచ్చు. అయితే అది రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టం. ఓపెన్ ఎయిర్ ధియేటర్లకూ .. వచ్చే నెల 21 నుంచి పర్మిషన్లు ఇచ్చారు. ్లాగే.. సభలు, సమావేశాలను వంద మందితో నిర్వహించుకోవచ్చు. పెళ్లిళ్లకూ ఇది వర్తిస్తుంది. స్కూళ్లు, కాలేజీలు తెరవడానికి అనుమతి ఇవ్వలేదు కానీ.. 9 నుంచి 12వ తరగతి వరకు చదువుకుంటున్నవారు తమ ఉపాధ్యాయుల సలహాల కోసం తల్లిదండ్రుల ముందస్తు అనుమతితో స్వచ్ఛందంగా స్కూళ్లను సందర్శించడానికి వెసులుబాటు కల్పించింది. రాష్ట్రాల మధ్య రవాణాకు ఎలాంటి పర్మిట్లు అవసరం లేదని.. కేంద్రం స్పష్టం చేసింది. కేంద్రం మార్గదర్శకాలను దేశం మొత్తం పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. కేంద్ర హోంశాఖ అనుమతించిన విమానాలు తప్ప.. ఇతర వాణిజ్య విమానాల రాకపోకలను మరో నెల వరకు నిషేధించారు.
మెట్రోను ప్రారంభించడానికి కేంద్రం అవకాశం ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం మాత్రం మరికొన్ని రోజులు ఆగాలని అనుకుంటోంది. రెండు, మూడు రోజుల్లో దీనిపై నిర్ణయం తీసుకొనే అవకాశముంది. కరోనా తీవ్రత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం మెట్రో సేవలను ఇప్పట్లో పునరుద్ధరించడానికి సుముఖంగా లేదని చెబుతున్నారు. అయితే.. మెట్రో అధికారులు మాత్రం ట్రయల్ రన్ ప్రారంభించారు. మార్గదర్శకాలు రూపొందించారు.