సంగీత దర్శకుడిలో గీత రచయిత దాగున్నట్టే, గీత రచయితల్లోనూ సంగీత దర్శకుడు ఉంటాడు. అప్పుడప్పుడూ కలం పట్టి, పాట రాయడం సంగీత దర్శకుల స్టైల్ అయితే, తమకు తామే ఓట్యూన్ తయారు చేసుకుని, పాటలు రాసేయడం.. రచయితల అభిరుచుల్లో ఒకటి. అయితే.. గీత రచయితలు పూర్తి స్థాయి సంగీత దర్శకులుగా ఎదగలేదు. ఎదిగే ప్రయత్నమూ చేయలేదు. అయితే రామ జోగయ్య శాస్త్రి మాత్రం ఓ అడుగు ముందుకేశారు.
టాలీవుడ్ లో నెం.1 గీత రచయితగా కొనసాగుతున్నారు రామజోగయ్య శాస్త్రి. మాస్, కమర్షియల్, ఐటెమ్.. ఇలా ఎలాంటి బాణీ కి అయినా అలవోకగా పాటలు రాసేస్తారు. ఫ్యాన్సీ పదాలతో కనికట్టు చేయడంలోనూ సిద్ధహస్తులు. ఇప్పుడు ఆయన సంగీత దర్శకులుగా మారారు. ఓ ప్రైవేటు ఆల్బమ్ కోసం. కరోనాపై రామజోగయ్య శాస్త్రి ఓ పాట కంపోజ్ చేసి, రాసి, విడుదల చేశారు. సీశైలం మల్లయ్యా.. మా భూగోళం మంచిగ లేదయ్యా.. అంటూ సాగే ఈ పాట ఈ రోజు విడుదల అయ్యింది. ఈ పాటకు మ్యూజిక్ అందించింది కూడా రామజోగయ్యనే. పాట ఎంత సింపుల్ గా ఉందో, ట్యూను అంత ఆకట్టుకునేలానూ ఉంది. కరోనా అనే ప్రస్తావన లేకుండా.. వచ్చిన కరోనా పాట ఇదే కావొచ్చు. అందుకే.. అన్ని వేళలా.. గుర్తు చేసుకునే పాటలా హాయిగా సాగింది. `ఖలేజా`లో శివుడిపై పాట రాసి పాపులర్ అయ్యారు రామజోగయ్య. ఇప్పుడు అదే శివుడి పాటతో… సంగీత దర్శకుడి అవతారం ఎత్తారు. చూద్దాం… భవిష్యత్తులో సినిమాలకూ సంగీతం అందించేస్తారేమో..?