ప్రతీ హీరోకీ ఓ కల ఉంటుంది. ఫలానా దర్శకుడితో సినిమా చేయాలని. అందుకోసం కలలు కంటారు. కష్టాలు పడతారు. పడిగాపులు కాస్తారు. నాగార్జునకీ అలాంటి ఓ కల ఉంది. దాన్ని సాకారం చేసుకోవడానికి బాగానే కష్టపడ్డాడు. ఆ దర్శకుడ్ని కష్టపెట్టాడు. ఆ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే..
నాగార్జున కెరీర్‌కి అప్పుడప్పుడే బాటలు పడుతున్నాయి. ఈ దశలోనే దర్శకుడిగా విశ్వరూపం చూపిస్తున్నాడు మణిరత్నం. అలాంటి దర్శకుడితో ఓ సినిమా చేస్తే.. నటుడిగా తానేంటో నిరూపించుకునే అవకాశం దక్కుతుందన్నది నాగార్జున ఆశ. నాగార్జున అప్పటికి కొత్తే కావొచ్చు. కానీ.. వెనుక అక్కినేని నాగేశ్వరరావు అనే పెద్ద కొండ అండగా ఉంది. నాగేశ్వరరావు అనుకుంటే.. మణిరత్నం – నాగార్జున కాంబో క్షణాల్లో ఫిక్స్ చేయగలరు. కానీ.. అక్కినేని మాత్రం అదే పట్టించుకోలేదు. `నీ తంటాలేవో నువ్వే పడు..` అని నాగార్జునని వదిలేశారు. అప్పటికి మణిరత్నం కూడా తెలుగులో సినిమాలు చేయలేదు. తెలుగు సినిమా కంటే.. తమిళ సినిమాలపైనే ఆయన దృష్టి. ఆయన అభిరుచికి అక్కడే కరెక్ట్ అని భావించి… తన ప్రయత్నాల్లో తాను ఉన్నారు.
కానీ నాగార్జున మాత్రం.. `మణిసార్ మీతో ఓ సినిమా చేయాలి..` అని ఆయన్ని కలిసినప్పుడల్లా అడుగుతూనే ఉన్నాడు. నాగార్జున అన్నిసార్లు అడిగే సరికి.. కాదనలేక `అగ్ని నక్షిత్రం` అనే ఓ కథ వినిపించారు. ఆ కథలో ఇద్దరు హీరోలు. ఒక పాత్ర నాగార్జున చేస్తే, మరో పాత్ర వెంకటేష్ చేస్తే బాగుంటుందన్నది మణిరత్నం ఆలోచన. అప్పటికి నాగార్జున, వెంకటేష్ బావా బామ్మర్దులు కూడా. మణిరత్నం – వెంకటేష్ మధ్య భేటీ కూడా జరిగింది. మణిరత్నంతో సినిమా చేయాలని వెంకీ చాలా ఆశగానే ఉన్నాడు. కానీ అప్పటికి నాగార్జున – వెంకటేష్ ల మధ్య సత్సంబంధాలు లేవు. దాంతో.. మణి సినిమా అవుననలేక, వద్దనలేక డైలామాలో పడ్డాడు వెంకీ. ఈ కథ పట్టుకుని దాదాపు యేడాది ఎదురు చూశాడు మణిరత్నం. నాగార్జున వైపు నుంచి ఓకే గానీ, వెంకీ నుంచి మాత్రం ఉలుకూ పలుకూ లేదు. వెంకటేష్ చేయకపోతే, మరో పాత్రకు నాగార్జున కూడా అనవసరం అనుకున్నాడు మణి. అందుకే.. వారిద్దర్నీ పక్కన పెట్టి కార్తి, ప్రభులతో `అగ్ని నక్షత్నం` తీసేశాడు. అది `ఘర్షణ`గా విడుదలై.. తెలుగులోనూ సూపర్ హిట్ అయ్యింది. అలా… ఓ సూపర్ హిట్ ని నాగార్జున చేజార్చుకున్నాడు.
అయినా సరే, నాగ్ తన ప్రయత్నాలు మానలేదు. ప్రతీరోజూ.. మణిరత్నంకి ఫోన్ చేసి `సార్… ఈసారి మాత్రం మిస్ అవ్వను.. మనం కలిసి చేద్దాం` అనేవాడట. అంతే కాదు.. వీలున్నప్పుడల్లా మణిరత్నం ఆఫీసు, ఇంటి చుట్టూ తెగ తిరిగేవాడట నాగార్జున. ముందు నాగార్జున వైఖరిని పెద్దగా పట్టించుకోకపోయినా.. తన పట్టుదల చూసి మణిరత్నం మనసు కూడా కరిగిపోవడం మొదలెట్టింది. దాంతో.. మరో కథ తయారు చేసి నాగ్‌కి చెప్పాడు. అదే…. `గీతాంజలి`. నాగార్జునని యువతరానికి బాగా దగ్గర చేసిన సినిమా అది. నాగార్జున కెరీర్లో టాప్ 3లో తప్పకుండా స్థానం ఉంటుంది. మణి చేసిన తొలి, ఆఖరి తెలుగు సినిమా కూడా అదే. అది నాగార్జున పట్టుదలతో సాధ్యమైంది.