విప్లవ రచయితల సంఘం నేత వరవరరావును వదిలి పెట్టాలని కోరుతూ.. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి లేఖ రాసిన అంశంపై బీజేపీ నెల రోజుల తర్వాత స్పందించడంతో వైసీపీ ఉలిక్కి పడింది. వరవరరావు ప్రస్తుతం ప్రధానమంత్రిని హత్య చేయడానికి కుట్ర పన్నిన కేసులో బెయిల్ కూడా రాని చట్టం కింద జైల్లో ఉన్నారు. ఆయనకు నెల రోజుల కింద అనారోగ్యం సోకడంతో ఆస్పత్రికి తరలించారు. అప్పుడే చాలా మంది సానుభూతిపరులు ఆయనను విడిచిపెట్టాలని.. ఎవరికి అధికారం ఉంటే.. వారికి లేఖలు రాస్తూ వచ్చారు. అలా భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఓ లేఖను ఉపరాష్ట్రపతికి పంపారు.
అయితే.. భూమన లేఖ పంపిన నెల రోజుల తర్వాత భారతీయ జనతా పార్టీ అనూహ్యంగా స్పందించింది. ప్రధానిని హత్య చేయడానికి కుట్ర పన్నిన వ్యక్తినే వదిలేయమంటారా.. అని సునీల్ ధియోధర్ కన్నెర్ర చేసినంత పని చేశారు. దీంతో వైసీపీ ఉలిక్కి పడింది. లేఖ రాసినప్పుడు సైలెంట్‌గా ఉండి.. ఇప్పుడెందుకు బీజేపీ ఈ అంశాన్ని హైలెట్ చేసిందో.. వారికి అర్థం కాలేదు. ఎందుకైనా మంచిదని అనుకున్నారేమో కానీ.. భూమన కరుణాకర్ రెడ్డితో.. ఓ వివరణ లేఖను.. సునీల్ ధియోధర్కు పంపించారు. అందులో.. తన లేఖ పార్టీకి సంబంధం లేదని.. వ్యక్తిగతంగా రాశానని.. ఆయనను విడుదల చేయమని కోరాను అంటే.. ప్రధానిపై గౌరవం లేదని కాదని.. వివరణ ఇచ్చారు.
ఇందులో భూమన ఓ ట్విస్ట్ కూడా ఇచ్చారు.. అదేమిటంటే.. తాను ఆర్ఎస్ఎస్ మనిషినని చెప్పుకునే ప్రయత్నం చేశారు. తన రాజకీయ జీవితం.. ఆరెస్సెస్‌తో ప్రారంభమయిందని చెప్పుకున్నారు. కానీ.. భూమన కరుణాకర్ రెడ్డి నేపధ్యం మొత్తం రాడికల్ నేపధ్యం అని అందరికీ తెలుసు. కానీ ఆయన మాత్రం… తనది ఆరెస్సెస్ అన్నట్లుగా లేఖలో చెప్పుకోవడానికి తాపత్రాయ పడ్డారు. దీంతో.. బీజేపీ ఆషామాషీగా ఈ లేఖ రాయలేదని.. దాని వెనుక ఇంకేదో ఉందన్న గుసగుసలకు మరింత ప్రాధాన్యం ఏర్పడుతోంది.