ముఖ్యమంత్రి పర్యటనలో పాలు పంచుకోవాల్సిన కడప ఎంపీ అవినాష్ రెడ్డికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వైఎస్ఆర్ వర్థంతి సందర్భంగా జగన్ సెప్టెంబర్, ఒకటి రెండో తేదీల్లో ఇడుపులపాయలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా.. జగన్‌ను కలిసే అవకాశం ఉన్న వారందరి లిస్ట్ తయారు చేసుకున్న సెక్యూరిటీ అధికారులు… వారందరికీ కరోనా టెస్టులు చేయించారు. అందులో అవినాష్ రెడ్డికి పాజిటివ్ గా తేలింది. స్వల్ప లక్షణాలు ఉండటంతో… పరిస్థితిని బట్టి… ఆస్పత్రిలో చేరాలని అనుకుంటున్నారు.
అవినాష్ రెడ్డి గత కొద్ది రోజులుగా విస్తృతంగా పార్టీ కార్యక్రమాల్లో తిరుగుతున్నారు. రెండురోజుల కిందట… పార్టీ ఆఫీసులో ముఖ్య నేతలతోనూ సమావేశమయ్యారు. అవినాష్ రెడ్డి ప్రైమరీ కాంటాక్ట్స్ పదుల సంఖ్యలో ఉంటారు. దీంతో.. వారందరూ టెస్టులు చేయించుకోవాల్సి వస్తోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో అపాయింట్మెంట్ ఉన్న వారు.. ఆయనను కలవాలనుకునేవారు ఖచ్చితంగా కరోనా టెస్టు చేయించుకుని నెగెటివ్ వస్తేనే… సమయం కేటాయిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏపీలో వైరస్ ప్రమాదకరంగా విస్తరిస్తూ ఉండటంతో ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
మరో వైపు ఏపీలో కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య అంతకంతూ పెరుగుతోంది. రోజుకు పదివేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. ప్రజా ప్రతినిధులు కూడా పెద్ద ఎత్తున కరోనా బారిన పడుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డికి కూడా పాజిటివ్ వచ్చింది.