జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి వికేంద్రీకరణకు పట్టుదలగా ఉన్నారు. అందుకే అమరావతి నుంచి రాజధానిని విశాఖకు తరలిస్తున్నారు. హైకోర్టుకు కర్నూలుకు తరలిస్తున్నారు. అయితే.. ఇంతా మాత్రాన అభివృద్ధి జరిగిపోతుందా… అనే ప్రశ్నలు అన్ని వైపుల నుంచి వినిపిస్తున్నాయి. చేయాల్సింది పాలనా వికేంద్రీకరణ కాదని.. అభివృద్ధి వికేంద్రీకరణ అని కొంత మంది చెబుతున్నారు. కానీ.. ఎవరూ పట్టించుకోవడం లేదు.. అదే సమయలో.. కర్నూలు, విశాఖ సరే.. మరి మిగతా జిల్లాల పరిస్థితేమిటి.. అన్న చర్చ కూడా ప్రారంభమయింది. అందుకే… జనసేన నేత… ఇటీవలే కాపు ఉద్యమానికి గట్టిగా నిలబడతానని ప్రకటించిన హరిరామ జోగయ్య ఓ ఐడియా ముఖ్యమంత్రి జగన్కు పంపించారు.
హరిరామ జోగయ్య ఐడియా ప్రకారం… సెక్రటేరియట్ మొత్తాన్ని విశాఖలో పెట్టడం వల్ల.. ఇతర జిల్లాలకు అన్యాయం జరుగుతుంది. శాఖల వారీగా.. అన్ని హెచ్వోడీలను. జిల్లాలకు పంపిణీ చేయాలి. అన్ని జిల్లాల్లోనూ ఒక్కో హెచ్వోడీ కార్యాలయం పెట్టడం ద్వారా.. ఆయా జిల్లాల సమగ్రాభివృద్ధికి అవకాశం ఉంటుంది. ఏ ఏ జిల్లాల్లో ఏ రంగానికి ప్రాధాన్యం ఉంటుందో… అ రంగం ప్రధాన కార్యాలయం అక్కడ పెట్టాలని హరిరామ జోగయ్య అభిప్రాయం. ముఖ్యమంత్రి జగన్ వికేంద్రీకరణ ఆలోచనకు… జోగయ్య.. మరింత విస్తృత రూపం దీని ద్వారా ఇచ్చారని అనుకోవాలి.
ప్రభుత్వ కార్యాలయాలు పెట్టడం ద్వారా.. రాజధాని లుక్ తీసుకువచ్చి.. దాని ద్వారా అభివృద్ది జరిపేయాలని ఏపీ సర్కార్ కంకణం కట్టుకుంది. దీని కోసమే… వికేంద్రీకరణ చేస్తోంది. ముఖ్యమంత్రి ఆలోచనలు ఇలాగే ఉన్నాయి కాబట్టి.. జోగయ్య ఇచ్చిన సలహా కూడా.. ఆయనకు నచ్చే అవకాశం ఉంది. ఒక వేళ నచ్చితే మాత్రం… పాలనలో విప్లవం రావడం ఖాయం. ప్రతీ జిల్లా ఓ రాజధానిగా మారిపోతుంది. ప్రతీ చోటా… ఓ హెచ్వోడీ ఆఫీసు ఉంటుంది. అన్ని జిల్లాలకు న్యాయం చేసినట్లు అవుతుంది.