రాజకీయాల్లో దాదా అని పార్టీలకు అతీతంగా అందరూ పిలుచుకునే ఆత్మీయ నేత,భారతరత్న ప్రణబ్ ముఖర్జీ తుదిశ్వాస విడిచారు. కొంత కాలంగా ఆయన ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కోమాలో ఉన్నారు. ఈ సాయంత్రం ఆయన చనిపోయారు. బెంగాల్‌లో ఆయన పెద్దగా ఎదకపోయినప్పటికీ..జాతీయ నేతగా ఎవరెస్ట్ తరహాలో నిలబడ్డారు. 1969లో జరిగిన బెంగాల్ కాంగ్రెస్ సమావేశంలో ధాటిగా ప్రసంగిస్తున్న ప్రణబ్ ముఖర్జీని చూసి అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ముగ్దులయ్యారు. అతని ప్రసంగం తీరు, విషయ పరిజ్ఞానం ఆమెను ఆకట్టుకుంది. అలాంటి నాయకుడు తన బృందంలో ఉండాలని భావించి వెంటనే రాజ్యసభకు ఎంపిక చేశారు. అప్పటికి ప్రణబ్ వయస్సు 34 సంవత్సరాలు మాత్రమే. ఆ వయసులోనే ఆయన రాజ్యసభకు ఎన్నిక కావడంతో పెద్దరికం వచ్చేసింది.
చేపట్టిన పదవులకు తనదైన పనితీరుతో వన్నెతెచ్చిన నాయకుడు. 47 ఏళ్ల వయస్సులో ఆర్థిక శాఖ మంత్రి అయ్యారు. అప్పట్లో ఆర్థిక మంత్రి హోదాలో మన్మోహన్ సింగ్ ను ఆర్బీఐ గవర్నర్ గా నియమించారు. తర్వాత అదే మన్మోహన్ సింగ్ మంత్రివర్గంలో 2004 నుంచి 2012 వరకూ ప్రణబ్ మంత్రిగా పని చేశారు. 70లనాటి నుంచి కాంగ్రెస్ హైకమాండ్‌కు అత్యంత సన్నిహితుడు. దక్షిణాది కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు ఆయనకు కొట్టిన పిండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విషయంలో ఆయన ముద్ర మర్చిపోలేనిది. టీఆర్ఎస్ తో కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుని గెలిచిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు హామీ నెరవేర్చేందుకు ప్రణబ్ నేతృత్వంలోనే కమిటీని నియమించారు. చివరికి రాష్ట్రపతిగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ఆయనే సంతకం చేశారు.
విషయ పరిజ్ఞానం, నేర్పు, ఓర్పు, సంయమనం, సమయోచితంగా వ్యవహరించడంలో ఆయన దిట్ట. ఇతరులను తన వాదనాపటిమతో ఒప్పించడంలో ఆయనకు ఆయనే సాటి. పెద్దగా ప్రజాదరణ లేనప్పటికీ అయిదు దశాబ్దాల పాట ప్రజాజీవితంలో కొనసాగడం అందరికీ సాధ్యమయ్యేది కాదు. దాదాపుగా యాభై ఏళ్ల పాటు ఆయన రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. ఆయన మృతితో ఓ శకం ముగిసిందని అనుకోవచ్చు.